-సాగు చట్టాల రద్దు డిమాండ్ తో రైతుల భారత్ బంద్
-గురుగ్రామ్, ఘాజీపూర్ సరిహద్దుల్లో స్తంభించిన రవాణా
-ఢిల్లీ నోయిడా ఫ్లైవేపై భారీ ట్రాఫిక్ జాం
-ఢిల్లీ–అమృత్ సర్ హైవేపై రాకపోకల నిలిపివేత
నూతన సాగు చట్టాల డిమాండ్ తో రైతులు తలపెట్టిన భారత్ బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతృత్వంలోని 40 రైతు సంఘాల నేతలు బంద్ లో పాల్గొంటున్నారు. బంద్ మొదలైన కొన్ని గంటల్లోనే పలు హైవేలపై రాకపోకలు స్తంభించాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.
ఢిల్లీ సరిహద్దుల్లోని రోడ్లు ట్రాఫిక్ జామ్ తో నిండిపోయాయి. ఎక్కడికక్కడ కార్లు, పెద్ద వాహనాలు ఆగిపోయాయి. గురుగ్రామ్ హైవేపై కొన్ని గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ వేటినీ అనుమతించబోమని రైతులు చెప్పిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నోయిడా డైరెక్ట్ ఫ్లై వేపైనా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘాజీపూర్ సరిహద్దుల్లోనూ రాకపోకలు నిలిచాయి. పోలీసుల వాహనాల రాకపోకలను ఆపేశారు.
ఢిల్లీలో షాపులు యథావిధిగా తెరుచుకున్నాయి. సూత్రప్రాయ మద్దతునిస్తున్నా వారు బంద్ లో పాల్గొనలేదు. ఆటోలు, ట్యాక్సీలూ యథాప్రకారమే నడుస్తున్నాయి. కాగా, ఢిల్లీలో భారత్ బంద్ కు పిలుపునివ్వలేదని, ముందుజాగ్రత్తగా భద్రత కోసం సిబ్బందిని నియమించామని పోలీసులు చెప్పారు. హర్యానాలోని కురుక్షేత్రలో ఢిల్లీ–అమృత్ సర్ జాతీయరహదారిపై రాకపోకలను నిలిపేశారు.