ఇది కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన విజయం: ఈటల రాజేందర్
-నేను వెన్నుపోటు పొడిచానని టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోంది
-వెన్నుపోటు పొడిచింది కేసీఆరే
-చిన్న పిల్లలం కాదు.. నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు
-టీఆర్ఎస్ నుంచి నన్ను వెళ్లగొట్టారు
-బీజేపీ నన్ను దగ్గరకు తీసుకుని చేర్చుకుంది
-వారు వెళ్లగొడితేనే నేను బయటకు వచ్చాను
‘ఇది కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన విజయం. నిర్బంధాలు పెట్టి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈటల రాజేందర్ పార్టీలు మారే వ్యక్తి కాదు. టీఆర్ఎస్ నుంచి నన్ను వెళ్లగొట్టారు. నన్ను బీజేపీ దగ్గరకు తీసుకుని చేర్చుకుంది. నేను వెన్నుపోటు పొడిచానని టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోంది. వారు వెళ్లగొడితేనే నేను బయటకు వచ్చాను. వెన్నుపోటు పొడిచింది కేసీఆర్’ అని ఈటల రాజేందర్ ఆవేశంగా అన్నారు. నిన్నటి ఉప ఎన్నిక ఫలితాల్లో ఆయన విజయం సాధించిన నేపథ్యంలో ఈ రోజు హుజూరాబాద్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘గుర్తు పెట్టుకోండి.. కుట్రదారుడు కుట్రలకు నాశనమైపోతాడు. కుల సంఘాలు, భవనాలు, గుడులకు డబ్బులు ఇచ్చారు’ అని విమర్శించారు
‘బయటకు వెళ్లగొట్టింది కేసీఆర్. మేము చిన్న పిల్లలం కాదు. నా చరిత్ర తెరిచిన పుస్తకం లాంటిది. సూర్యుడి మీద ఉమ్మి వేస్తే, వేసిన వారి మీదే అది పడుతుంది. మాపై కుట్రలు పన్నితే, కుట్రలు పన్నే వారే నష్టపోతారు. నా హుజూరాబాద్ ప్రజలు నిబద్ధతకు మారుపేరు. నా విజయాన్ని హుజూరాబాద్ ప్రజలకు అంకితం చేస్తున్నాను. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఈ నియోజక వర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళతాను’ అని ఈటల రాజేందర్ చెప్పారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్ పాల్పడినటువంటి నీచపు రాజకీయాలను తాను ఎన్నడూ చూడలేదని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. .’టీఆర్ఎస్ దళిత బంధు పెట్టినా ప్రజలు నన్ను గెలిపించారు. ఓటు వేయకపోతే దళిత బంధు నిలిపేస్తామని ప్రభుత్వం బెదిరించింది. పింఛన్లు ఆపేస్తామని వృద్ధులనూ భయపెట్టింది. ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం కోసమే గత ఆరు నెలలుగా అధికార యంత్రాంగం పనిచేసింది’ అని ఈటల రాజేందర్ చెప్పారు.