రేణిగుంట చేరుకున్న అమిత్ షా… స్వయంగా స్వాగతం పలికిన సీఎం జగన్
- రేపు సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ
- భేటీలో పాల్గొనేందుకు ఏపీకి వచ్చిన అమిత్ షా
- ఈ రాత్రికి శ్రీవారి దర్శనం చేసుకోనున్న షా, జగన్
- అమిత్ షా రాకతో తిరుపతిలో బీజేపీ శ్రేణుల కోలాహలం
దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు కేంద్రం హోంమంత్రి అమిత్ షా తిరుపతి వచ్చారు. ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు ఏపీ సీఎం జగన్ స్వయంగా స్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వెంట మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రోజా తదితరులు ఉన్నారు. కాసేపట్లో అమిత్ షా, సీఎం జగన్ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు.
కాగా, అమిత్ షా రాక నేపథ్యంలో రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద బీజేపీ శ్రేణుల కోలాహలం నెలకొంది. అమిత్ షా ఎయిర్ పోర్టు నుంచి వెలుపలికి రాగానే నినాదాలతో హోరెత్తించారు. బీజేపీ శ్రేణులకు అభివాదం చేసిన ఆయన సీఎం జగన్ తో కలిసి తిరుమల పయనం అయ్యారు.
రేపు ఉదయం నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్టు, ముప్పవరపు ఫౌండేషన్ కార్యక్రమాలలో పాల్గొననున్న అమిత్ షా… మధ్యాహ్నం 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ సీఎంలు పాల్గొంటారు.