మూడు రాజధానుల నిర్ణయంలో మార్పు లేదు… కొత్త బిల్లుతో వస్తాం: అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన!
వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లుల ఉపసంహరణ
అసెంబ్లీలో ప్రకటన చేసిన సీఎం జగన్
మూడు రాజధానులపై తమ నిర్ణయంలో మార్పులేదని వెల్లడి
కొత్త బిల్లుతో ప్రజలను మెప్పిస్తామని ధీమా
ఏపీకి మూడు రాజధానుల అంశంలో తమ వైఖరిలో మార్పు లేదని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. సీఆర్డీయే రద్దు ఉపసంహరణ బిల్లును ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో ప్రవేశపెట్టిన అనంతరం ఈ అంశంపై చర్చ ప్రారంభమైంది.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ప్రజలు తమకు ఓటు వేసి గెలిపించారని తెలిపారు. హైదరాబాద్ వంటి సూపర్ మోడల్ సిటీ వద్దే వద్దని, అలాంటి చారిత్రక తప్పిదానికి పాల్పడరాదన్న అభిప్రాయాలను బలపరుస్తూ 2019లో ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రజాతీర్పును బలంగా నమ్మి వికేంద్రీకరణ దిశగా అడుగులు ముందుకు వేశామని చెప్పారు.
రాష్ట్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలన్న తాపత్రయం వల్లే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని విశాఖలో, శాసన రాజధాని అమరావతిలో, కర్నూలులో హైకోర్టు… ఇలా ప్రణాళిక రూపొందించామని వివరించారు. రాయలసీమలో రాజధాని ఉండాలన్నది అక్కడి ప్రజల సుదీర్ఘకాల ఆకాంక్ష అని తెలిపారు. వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే ప్రక్రియ ప్రారంభించి ఉంటే మంచి ఫలితాలు వచ్చి ఉండేవని అభిప్రాయపడ్డారు. అయితే, రకరకాల అపోహలు, న్యాయపరమైన చిక్కులు సృష్టించారని, అందుకే తాము బిల్లు ఉపసంహరణ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. కొందరికి అన్యాయం జరుగుతుందన్న ప్రచారాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
ప్రస్తుతానికి వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను వెనక్కి తీసుకుంటున్నామని వెల్లడించారు. విస్తృత, విశాల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అయితే మూడు రాజధానులపై తమ నిర్ణయం మారదని, ఈ బిల్లును మరింత మెరుగుపరిచి, సమగ్రమైన బిల్లుగా ముందుకు తెస్తామని సీఎం జగన్ వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలకు సంపూర్ణంగా వివరించేలా బిల్లును నవీకరిస్తామని తెలిపారు. కొత్త బిల్లుపై అన్ని వర్గాల ప్రజలను ఒప్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చట్టపరంగా, న్యాయపరంగా అన్ని సందేహాలకు ఈ కొత్త బిల్లు ద్వారా సమాధానమిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు ఉపసంహరణ బిల్లులపై ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.