- ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్… అప్రమత్తమైన ప్రభుత్వం!
-కొమరిన్, శ్రీలంకపై ఉపరితల ఆవర్తనం
-నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో విస్తారంగా వానలు
-పెన్నా నది మరోసారి ఉగ్రరూపం
-అహోబిలం రిజర్వాయర్ నుంచి వెయ్యి క్యూసెక్కుల విడుదల
-కండలేరు జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం
-ఈ నెల 29న అండమాన్ సముద్రంలో అల్పపీడనం
-వాయుగుండంగా మారే అవకాశం
కొమరిన్, శ్రీలంక తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఏపీలోని నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తాజా హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నదులు, వాగులు వంకలు అన్నీ పరవళ్లు తొక్కుతున్నాయి. ఎక్కడిక్కడ జలాశయాలు తొణికిసలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా వర్షాలతో మళ్లీ వరదలు సంభవించే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అటు, దక్షిణ అండమాన్ సముద్రంలో రేపు (నవంబరు 29) అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ఇది వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర దిశగా పయనించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
అనంతపురం జిల్లాలో పెన్నా నదికి పోటెత్తిన వరద… అన్ని డ్యాముల గేట్లు ఎత్తివేత!
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు అనంతపురం జిల్లాలో పెన్నా నది మహోగ్రరూపం దాల్చింది. పెన్నా నదికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. దాంతో జిల్లాలో పెన్నా నదిపై ఉన్న అన్ని డ్యాముల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వరద గేట్ల నుంచి నీటిని విడుదల చేయడం డ్యామ్ చరిత్రలో ఇదే తొలిసారి! అప్పర్ పెన్నార్, మిడ్ పెన్నార్, చాగల్లు రిజర్వాయర్ల గేట్లు కూడా ఎత్తివేశారు.
అటు, కండలేరు జలాశయంలోనూ నీటి మట్టం పెరుగుతుండడంతో తెలుగు గంగ కాలువ నుంచి నీటి విడుదలకు అధికారులు సిద్ధమయ్యారు. స్వర్ణముఖి నదికి కూడా నీటిని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తొట్టంబేడు మండలం రాంభట్లపల్లి గ్రామస్తులను అధికారులు అప్రమత్తం చేశారు.