భారత్ లో అత్యంత శక్తిమంతమైన సైనికాధికారి… బిపిన్ రావత్!
- భారత తొలి సీడీఎస్ గా బిపిన్ రావత్
- తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదం
- ప్రాణాలు కోల్పోయిన బిపిన్ రావత్
- అంచెలంచెలుగా ఎదిగిన భరతమాత ముద్దుబిడ్డ
భారత త్రివిధ దళాల చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా సీడీఎస్ బిపిన్ రావత్ మరణాన్ని చెప్పుకోవచ్చు. తాను శిక్షణ పొందిన డిఫెన్స్ కాలేజీలో ఉపన్యాసం ఇవ్వడానికి వెళుతూ తమిళనాడులోని నీలగిరి వద్ద నంజప్పన్ ఛత్రం వద్ద హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో బిపిన్ రావత్ దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటనలో రావత్ తో పాటు అర్ధాంగి మధులిక సహా మొత్తం 13 మంది దుర్మరణం చెందారు.
రావత్ మరణవార్త యావత్ దేశాన్ని కుదిపివేసింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రావత్ మరణం దేశానికి తీరని లోటు అని విచారం వెలిబుచ్చారు.
63 ఏళ్ల బిపిన్ రావత్ స్వస్థలం ఉత్తరాఖండ్ లోని పౌరీ గర్వాల్. ఆయనది సైనిక కుటుంబం. రావత్ తండ్రి లక్ష్మణ్ సింగ్ కూడా సైనిక ఉన్నతాధికారే. దాంతో తండ్రి బాటలోనే రావత్ కూడా సైన్యంలోకి వచ్చారు. భారత ఆర్మీతో ఆయన అనుబంధం 1978లో మొదలైంది. గూర్ఖా రైఫిల్స్ రెజిమెంట్ లో ప్రస్థానం ప్రారంభించిన రావత్ అంచెలంచెలుగా ఎదిగారు. సైన్యంలో చేరిన ఏడాదే సెకండ్ లెఫ్టినెంట్ హోదా సాధించారు.
అక్కడ్నించి లెఫ్టినెంట్ గా, ఆర్మీ కెప్టెన్ గా, లెఫ్టినెంట్ కల్నల్ గా, కల్నల్ గా, బ్రిగేడియర్ గా, లెఫ్టినెంట్ జనరల్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా అత్యంత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పనితీరుకు నిదర్శనమే భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవీ నియామకం. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 17 కమాండ్లను ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లుగా ఏర్పాటు చేసే బాధ్యత కూడా ఆయనదే.
రక్షణ రంగంలో ఇటీవల కాలంలో సంస్కరణలు ఊపందుకోవడానికి ఆయనే ఆద్యుడు. ఆయన ఫోర్ స్టార్ జనరల్. లడఖ్ సంక్షోభ సమయంలో త్రివిధ దళాలకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తలా వ్యవహరించారు. భారత్ తో కయ్యానికి చైనా వెనుకంజ వేసేలా చేయడంలో జనరల్ బిపిన్ రావత్ పాత్ర కీలకమైనది.
దేశం కోసం ఆయన అందించిన సేవలకు గుర్తుగా అనేక సేవా మెడల్స్ వరించాయి. పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, యుద్ధ సేవా పతకం ఆయన అంకితభావానికి గీటురాళ్లు. బిపిన్ రావత్ అర్ధాంగి పేరు మధులిక రాజే సింగ్. వీరికి కృతిక, తరిణి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.