ఢిల్లీ సరిహద్దుల వద్ద టెంట్లు తొలగించేస్తోన్న రైతులు..
కొత్త సాగు చట్టాల రద్దుతో ఫలించిన రైతుల పోరాటం
స్వస్థలాలకు వెళ్తున్న అన్నదాతలు
మద్దతు తెలిపిన వారిని కలుస్తామన్న టికాయత్
సాగు చట్టాల రద్దుకు సుదీర్ఘంగా సాగిన పోరాటం …సుమారు 450 రోజుల పోరాటానికి ఫలితం దక్కింది. మొండిగా ,పట్టుదలతో తమఉద్యమాన్ని రైతులు కొనసాగించారు. ఎండకు ఎండినారు ,వానకు తడిశారు, ఎముకలు కొరికే చలిని లెక్క చేయలేదు .ఈ సందర్భంగా అనేకమంది రైతులు చనిపోయారు . అయినప్పటికీ రైతు ఉద్యమాన్ని నడిపి అనేక ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచారు. చివరకు కేంద్రం దిగివచ్చి రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అన్నదాతలు ఢిల్లీ సరిహద్దులు నుంచి స్వస్థలాలకు బయలు దేరారు . తమకు ఇంతకాలం అన్నిరకాల మద్దతు తెలిపిన వారినందరిని కలుస్తామని సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేష్ టికాయత్ తెలిపారు. వారు ఢిల్లీ సరిహద్దుల నుంచి ఖాళీ చేసుతున్న దృశ్యాలు వివిధ చానళ్ళు , పత్రికల్లో దర్శనమిస్తున్నాయి. ఈ నెల 15 వరకు మొత్తం ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకు రైతులు సిద్ధమైయ్యారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కొనసాగించిన పోరాటం ఫలించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి ఆ చట్టాలను ఉపసంహరించుకోవడంతో 15 నెలల ఆందోళనలను రైతులు విరమిస్తున్నారు.
ఘాజిపూర్, సింఘూ, టిక్రీ బోర్డర్లను విడిచి రైతులు తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. సింఘూ బోర్డర్ వద్ద వేసిన టెంట్లను రైతులు తొలగించారు. అలాగే, టిక్రి బోర్డర్ వద్ద రైతులు సంబరాలు జరుపుకున్నారు. అక్కడి నుంచి కూడా టెంట్లను తీసేశారు. ఇక, ఘాజీపూర్ బోర్డర్ వద్ద కూడా రైతులు ఆందోళనలు విరమిస్తున్నారు.
ఈ సందర్భంగా బీకేయూ నేత రాకేశ్ టికాయత్ మీడియాతో మాట్లాడుతూ… తాము ఆందోళన చేసిన సమయంలో మద్దతు తెలిపిన వారిని కలుస్తామని చెప్పారు. ఈ నెల 15వ తేదీన ఈ ప్రాంతం నుంచి మొత్తం ఖాళీ చేసి స్వస్థలాలకు వెళ్తామని తెలిపారు.