నన్ను ‘మై లార్డ్’ అని పిలవొద్దు… న్యాయవాదులకు స్పష్టం చేసిన ఒడిశా హైకోర్టు సీజే!
- ఒడిశా హైకోర్టు సీజే మురళీధర్ కీలక నిర్ణయం
- ‘సర్’ అని పిలిస్తే సరిపోతుందన్న సీజే
- స్వాగతించిన బార్ అసోసియేషన్
భారతదేశంలో ఇప్పటికీ బ్రిటీష్ కాలం నాటి వ్యవస్థల ఆనవాళ్లు మిగిలే ఉన్నాయి. కోర్టుల్లో ఆనాటి పదజాలం ఇప్పటికీ తొలగిపోలేదు. మై లార్డ్ అనే పదం కూడా ఆ కోవలోకే వస్తుంది. తాజాగా, ఈ విషయంపై ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై విచారణల సందర్భంగా న్యాయవాదులు తనను “మై లార్డ్” అని, “యువర్ లార్డ్ షిప్’ అని సంబోధించరాదని స్పష్టం చేశారు.
“న్యాయవాదులకు, వాదులు, ప్రతివాదులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ధర్మాసనంలోని జడ్జిలను ఎవరూ ఇకపై ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్ షిప్’, ‘యువరానర్’, లేక ‘ఆనరబుల్’ అనే పదాలను ఉపయోగించవద్దు’ అని కోరారు. “సర్” అంటే సరిపోతుందని జస్టిస్ మురళీధర్ పేర్కొన్నారు. ఒడిశా హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శి జేకే లెంకా చీఫ్ జస్టిస్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇతర జడ్జిలు కూడా ఇదే సూత్రాన్ని అనుసరించాలని సూచించారు.