రాజస్థాన్ లో ఓ వైన్ షాపుకు వేలం… రూ.510 కోట్లు పలికిన వైనం!
రాజస్థాన్ లో కొత్త మద్యం పాలసీ
లాటరీ పద్ధతి స్థానంలో వేలం ప్రక్రియ
హనుమాన్ గఢ్ జిల్లాలో ఏకంగా 15 గంటల పాటు సాగిన వేలం
కళ్లు చెదిరే ధరతో వైన్ షాపు దక్కించుకున్న కిరణ్ కన్వర్
మద్యానికి ఎక్కడైనా మాంచి డిమాండ్ ఉంటుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో మద్యం షాపులకు వేలం వేస్తుంటారు. ఆ వేలంపాట ఒక్కోసారి ఐదారు కోట్ల రూపాయల వరకు వెళుతుంది. అయితే, రాజస్థాన్ లోని ఓ మద్యం షాపు వేలంలో వందల కోట్ల ధర పలకడం విశేషం అని చెప్పాలి. రాజస్థాన్ సర్కారు ఇటీవల కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చింది. లాటరీ పద్ధతిలో వైన్ షాపులు కేటాయించే బదులు వేలం పద్ధతి పాటించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో హనుమాన్ గఢ్ జిల్లా నోహర్ లోని ఓ వైన్ షాపు కోసం వేలం నిర్వహించగా ఏకంగా రూ.510 కోట్లు పలికింది. ఈ వేలంపాట 15 గంటల పాటు నిర్వహించారంటే ఎంత హోరాహోరీగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. చివరికి కిరణ్ కన్వర్ అనే వ్యాపారి ఈ వైన్ షాపును కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకున్నాడు. ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే… గతంలో ఇదే వైన్ షాపు లాటరీ పద్ధతిలో కేవలం రూ.65 లక్షలకే అమ్ముడైంది. ఈసారి వేలంలో ప్రారంభ ధర రూ.72 లక్షలుగా నిర్ణయించగా, క్రమంగా పెరుగుతూ పోయింది.