అఖిల పక్షంతో వస్తా.. సమయమివ్వండి
విశాఖ ఉక్కును లాభాల్లోకి తీసుకురావొచ్చు
ప్రధానికి ఏపీ సీఎం జగన్ లేఖ
విశాఖ ఉక్కు కర్మాగారంలో 100 శాతం పెట్టుబడులను ఉపసంహరిసామ్తని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో చేసిన ప్రకటన రాష్ట్ర ప్రజలకు, విశాఖ ఉక్కు ఉద్యోగులు, కార్మికులకు తీవ్ర నిరాశ కలిగించింది. ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని ఇప్పటికే కోరా. ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడం కన్నా కాస్త అండగా నిలిస్తే నిలుస్తుంది. కచ్చితంగా లాభాల బాటలోకి వస్తుందని నమ్ముతున్నా. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎలా లాభాల బాటలోకి తీసుకురావచ్చో ఇంతకు ముందే వివరించా. స్వయంగా వివరించేందుకు అఖిలపక్ష నేతలు, కార్మిక నాయకులతో కలిసి వస్తా. లక్ష్య సాధనలో మీతో కలిసి నడుస్తాం. వీలైనంత త్వరగా అపాయింట్‌మెంట్ ఇవ్వండి’ అని ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం లేఖ రాశారు. ‘‘విశాఖ ఉక్కు కర్మాగారానికి 19,700 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ రూ.లక్ష కోట్ల పైమాటే. ఇటీవల ఆర్‌ఐఎన్‌ఎల్ ఈ సంస్థను ఆధునికీకరించడంతోపాటు ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు విస్తరణ చర్యలు చేపట్టింది. వనరుల సేకరణ ప్రయత్నాలు సాగుతున్నాయి. విశ్వవ్యాప్తంగా ఈ రంగంలో ఉన్న మాంద్యం వల్ల 2014-15 నుంచి నష్టాల బాట పట్టింది. సొంత గనులు లేక ఉత్పత్తి వ్యయం పెరిగి లాభాలు పడిపోయాయి. పెట్టుబడులను ఉపసంహరించడం కంటే ఆ సంస్థకు కాస్త అండగా ఉంటే లాభాల బాటలోకి వస్తుందని నమ్మకంతో చెబుతున్నా. ఎక్కువ వడ్డీ రుణాలను తక్కువ వడ్డీకి మార్చడంతో పాటు రుణాలను వాటాల రూపంలోకి మార్చడం, ఇతర అనేక పరిష్కార మార్గాలను మీ దృష్టికి తెస్తున్నా. విశాఖ ఉక్కు కిందటేడాది డిసెంబరు నుంచి ఏడాదికి 6.3 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తోంది. ప్రతి నెలా రూ.200 కోట్ల లాభాలను ఆర్జిస్తోంది. ఇలాగే మరో రెండేళ్లు పని చేస్తే విశాఖ ఉక్కు పరిస్థితే మారిపోతుంది. ఈ ఫ్యాక్టరీకి సొంత గనులు లేవు. టన్ను రూ.5,260 చొప్పున ముడి ఖనిజం కొంటోంది. ఒడిశాలో ఉన్న గని కేటాయిస్తే సంస్థ పునరుద్ధరణకు ఉపయోగపడుతుంది’’ అని జగన్ పేర్కొన్నారు.