దేశం నాశనం కాకుండా ఉండాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి: లాలూ ప్రసాద్ యాదవ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని.. ఆయన జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడిన లాలూ.. దేశం నాశనం కాకుండా ఉండాలంటే తనను జాతీయ రాజకీయాల్లోకి రావాలన్నారు.
ఈసందర్భంగా ఇద్దరూ జాతీయ రాజకీయాల గురించి కాసేపు చర్చించుకున్నారు. లాలూ ఆరోగ్య, క్షేమ సమాచారాన్ని సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు. కేసీఆర్ పాలనా అనుభవం దేశానికి ఎంతో అవసరం అని లాలూ చెప్పారు. బీజేపీ అరాచక పాలన నుంచి దేశాన్ని కాపాడాలని.. దాని కోసం లౌకికవాద శక్తులన్నీ ఒకటి కావాలని.. దేశం నాశనం కాకుండా ముందుకు రావాలని కేసీఆర్‌ను లాలూ ప్రసాద్ యాదవ్ కోరారు. దీంతో లౌకిక, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవాలని.. ఆ రెండు శక్తుల ఐక్యత అనివార్యం అని.. రాజకీయ పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు.
అంతకుముందు.. కేసీఆర్‌తో రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నాయకుడు తేజస్వీ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్, తేజస్వీ మధ్య కూడా జాతీయ రాజకీయాలపై చర్చ జరిగింది. ఈ భేటీలో ఆర్జేడీకి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టాలని నేతలు అభిప్రాయపడ్డారు. లౌకికవాద శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని.. బీజేపీ అన్ని వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆర్జేడీ నేతలు సీఎం కేసీఆర్‌కు వెల్లడించారు.