Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు…

ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు…
-జీఏడీ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు నోటీసులిచ్చిన ఉద్యోగ సంఘాలు
-ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె
-పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
-పంతాలకు పోవద్దు …ఉద్యోగులకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ
-పీఆర్సీపై అనుమానాలు ఉంటే ఉద్యోగులు కమిటీని అడగొచ్చు: సజ్జల
-ఒకపక్క కరోనా బీభత్సం
-మరొక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక‌ దుస్థితి అర్థం చేసుకోవాలి
-స‌మ్మె చేయాల‌న్న ఆలోచ‌న వ‌ద్దు

ఏపీలో సమ్మె సైరన్ మోగింది. పీఆర్సీ అంశంపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. రాష్ట్ర జీఏడీ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు ఉద్యోగ సంఘాల నేతలు నోటీసును ఇచ్చారు. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని సమ్మె నోటీసులో డిమాండ్ చేశారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకునేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

పంతాలకు పోవద్దు …ఉద్యోగులకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ తీరుపై ఉద్యోగ సంఘాలు మండిప‌డుతోన్న విష‌యం తెలిసిందే. పీఆర్సీపై రాజీప‌డబోమని, చ‌ర్చ‌ల‌కూ రాబోమ‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు స్ప‌ష్టం చేసిన నేప‌థ్యంలో ఆ సంఘాల‌ నేత‌ల‌కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ లేఖ రాశారు. ఒకపక్క కరోనా బీభత్సం సృష్టిస్తోంద‌ని, మరొక పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక‌ దుస్థితిని దృష్టిలో పెట్టుకుని సమ్మెను ఆపవలసిందిగా ప్రార్థిస్తున్నానని ఆయ‌న పేర్కొన్నారు.

కొత్త పీఆర్సీ అమ‌లు చేయ‌డం వ‌ల్ల రూ.10,247 కోట్ల అద‌న‌పు భారం ప‌డుతుంద‌ని ఏపీ స‌ర్కారు చెబుతోంద‌ని ఆయ‌న గుర్తు చేశారు. అయితే, త‌మ‌కు చిన్న‌ మొత్తంలో పెంచిన జీతాలు వ‌ద్దంటూ ఉద్యోగ సంఘాలు స‌మ్మెకు దిగుతున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. సాధార‌ణంగా జీతాలు పెంచాల‌ని ఉద్యోగులు స‌మ్మెల‌కు దిగడం తాను చూశాన‌ని, అయితే, పెంచిన జీతాలు వ‌ద్దంటూ స‌మ్మెకు దిగ‌డం ఇదే ప్ర‌థ‌మం అయి ఉండొచ్చ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఏమైనా, ఈ పరిస్థితులలో స‌మ్మెను ఆపాల‌ని ఆయ‌న కోరారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పట్టింపులకు పోకుండా చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం సాధించాలని కోరుతున్నానని ఉండవల్లి పేర్కొన్నారు.

పీఆర్సీపై అనుమానాలు ఉంటే ఉద్యోగులు కమిటీని అడగొచ్చు: సజ్జల

పీఆర్సీపై ప్రభుత్వ కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, పీఆర్సీపై ఏవైనా సందేహాలు ఉంటే ఉద్యోగులు కమిటీని అడగొచ్చని స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని, చర్చలు, కమిటీపై అపోహలు వీడాలని సజ్జల పిలుపునిచ్చారు.

ఉద్యోగులను కొన్ని వర్గాలు వాడుకుంటున్నాయని, కానీ ప్రభుత్వానికి ఉద్యోగులపై ఎలాంటి ద్వేషం లేదని అన్నారు. ఎక్కడో ఉండి ప్రకటనలు ఇవ్వడం కంటే, తమ వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకుంటే సమంజసంగా ఉంటుందని హితవు పలికారు. పీఆర్సీ చాలదని ఉద్యోగులు అంటున్నారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమేరకు మంచి చేశామో తాము చెబుతున్నామని సజ్జల పేర్కొన్నారు. అలా కాకుండా ప్రభుత్వ కమిటీని గుర్తించబోమని ఉద్యోగులు పేర్కొనడం ప్రతిష్టంభనను మరింత పెంచడమేనని తెలిపారు. ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చాక కూడా చర్చలకు అవకాశం ఉంటుందని సజ్జల స్పష్టం చేశారు.

Related posts

తమిళనాడు డిప్యూటీ సీఎం గా ఉదయనిధి స్టాలిన్ …

Ram Narayana

మున్సిపల్ కార్మికులకు కనీస కనీస వేతనంకై కార్మికులు పోరుబాట మానవహారం!

Drukpadam

ఆ పుస్తకం చదువుతుంటే నా కళ్లలో నీళ్లు ఆగలేదు: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ!

Drukpadam

Leave a Comment