ఏపీని అస్తవ్యస్తంగా విభజించడానికి బీజేపీనే కారణం: సీపీఐ కార్యదర్శి రామకృష్ణ
- తెలుగు రాష్ట్రాల ఆర్థిక ఇబ్బందులకు బీజేపీ, కాంగ్రెస్ కారణం
- ఉద్యోగులను జగన్ మోసం చేశారు
- ఉద్యోగుల ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తాం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అడ్డగోలుగా, అస్తవ్యస్తంగా విభజించడానికి బీజేపీనే కారణమని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బంది పడటానికి బీజేపీ, కాంగ్రెస్ కారణమని చెప్పారు. ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్ పై ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు.
అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ఇవ్వడానికి జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. 43 శాతం ఫిట్ మెంట్ అందుకున్న ఉద్యోగులకు 23 శాతం ఫిట్ మెంట్ ఏ రకంగా ప్రయోజనకరమని అడిగారు. రేపు వామపక్ష పార్టీలతో సమావేశమవుతామని, అనంతరం ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉద్యమాలకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఉద్యోగుల ఉద్యమాన్ని తాము ముందుండి నడిపిస్తామని చెప్పారు.