రైతులను దగా చేస్తున్న కేసీఆర్ సర్కార్ …చర్చకు భట్టి సవాల్
పీపుల్స్ మార్చ్… ప్రజలనుంచి అన్యుహ స్పందన
ప్రాజెక్టుల నిర్మాణాలతో లక్షల కోట్ల దోపిడీ
8 ఏళ్ల పాలనలో పేదల కోసం ఒక్క పథకమైనా తెచ్చారా?
ఉపాధి నిధులను దారి మళ్లిస్తున్న పాలకులు
పాదయాత్రలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
పాదయాత్రకు సంఘీభావం తెలిపిన తెలుగుదేశం నాయకులు
రైతుబంధు పేరుతో రైతులను టిఆర్ఎస్ సర్కార్ దగా చేస్తున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. సీఎం కేసీఆర్ దీనికి అంగీకరించకుంటే బహిరంగ చర్చకు సిద్ధమవ్వాలని ముదిగొండ పాదయాత్ర వేదికగా భట్టి సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం, గోకినపల్లి, చిరుమర్రి, ముదిగొండ గ్రామాల్లో సోమవారం రెండవ రోజు భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్( పాదయాత్ర) నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిగొండ, వెంకటాపురం, చిరుమరి గ్రామాల్లో సభలు నిర్వహించారు
ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులకు పెట్టుబడి సాయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇస్తున్నామని గొప్పలు చెబుతూ వ్యవసాయానికి ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలు నిలిపివేశారని విమర్శించారు . పంట నష్టపోయిన రైతులకు 8 ఏళ్లుగా ఒక ఎకరానికి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లకు, ట్రాక్టర్ల కొనుగోలు పై ఇచ్చే సబ్సిడీ కేసీఆర్ ప్రభుత్వం నిలిపివేసింది దుయ్యబట్టారు . రైతుబంధు ఇచ్చి ఎరువుల ధరలు పెంచితే రైతులకు కలిగే ప్రయోజనం ఏంటని కెసిఆర్ ను ప్రశ్నించారు. ఎకరానికి పెట్టుబడి సాయంగా పది వేలు ఇచ్చి రైతుల పై రూ.30 వేల భారం వేస్తున్నది వాస్తవమా? కాదా? దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు.
కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులో 1.25 లక్షల కోట్ల దోపిడీ
కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో రూ. 1.25 లక్షల కోట్లను టిఆర్ఎస్ పాలకులు దోపిడీ చేశారని ఆరోపించారు. రూ. 28 వేల కోట్ల తో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసి రూ. 1.25 లక్షల కోట్లకు పెంచారన్నారు. నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేసిన ఇందిరా రాజీవ్ సాగర్ ప్రాజెక్టు ను సీతారామ ప్రాజెక్టు గా మార్చి ఎనిమిదేళ్లుగా ఒక ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వని ఆసమర్ధ, అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని దుయ్యబట్టారు.
ప్రాజెక్టుల నిర్మాణాలు పేరిట పాలకులు దండుకున్న ప్రజా సంపదను ప్రజలకు పంపిణీ చేయడానికే తాను పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నానని వెల్లడించారు. అవినీతి మయమైన పాలనను దించడానికి,ప్రజా సమస్యల పరిష్కారంకై కొట్లాడేందుకు మధిరలో మొదలైన పీపుల్స్ మార్చ్ రాష్ట్రం మొత్తం సుడిగుండంలా చుట్టేస్తామన్నారు. పీపుల్స్ మార్చ్ లో ప్రజలు ఇచ్చిన సమస్యల విన్నపాల పరిష్కారంకై అసెంబ్లీలో ప్రజల గొంతుక గా సర్కార్ ను నిలదీస్తానని, సర్కారు మెడలు వంచి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు.
పేదల కోసం ఒక్క పథకమైనా తెచ్చారా?
ఎనిమిదేళ్ల పాలనలో టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు పేద సామాన్య అభివృద్ధి చేయడానికి ఒక పథకమైన తీసుకువచ్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు మూడు పూటలా తిండి పెట్టడానికి తీసుకువచ్చిన ఉపాధి నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. సర్కార్ వైఫల్యాలను ఎండగట్టి ప్రజాసమస్యల పరిష్కారం కోసమే పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నానని తెలిపారు.
భట్టి పాదయాత్రకు తెలుగుదేశం సంఘీభావం
రెండవ రోజు సోమవారం ముదిగొండ మండల కేంద్రంలో కొనసాగిన భట్టి విక్రమార్క పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. పీపుల్స్ మార్చ్ లో తెలుగుదేశం నాయకులు తమ పార్టీ జెండాలు పట్టుకొని విక్రమార్క అడుగులో అడుగులు వేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రకు మద్దతు తెలిపి పాల్గొన్నవారిలో టిడిపి మండల అధ్యక్షుడు వీరబాబు, మండల కార్యదర్శి గుర్రం సంగయ్య, నాయకులు మాదాల శ్రీను, రామారావు, మల్లారపు యాదాద్రి తదితరులు పాల్గొన్నారు.
ఆయా గ్రామాల్లో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ నిర్మాత బాబసాహెబ్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ, దివంగత సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిల విగ్రహాలకు పూలమాలలు వేసి విక్రమార్క ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు, పాదయాత్ర నియోజకవర్గ కన్వీనర్ మాజీ జెడ్పిటిసి బుల్లెట్ బాబు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
భట్టి విక్రమార్క ప్రెస్ మీట్
నకిలీ విత్తనాలు అరికట్టడంలో సర్కార్ వైఫల్యం
నష్టపోయిన రైతులకు పూర్తి పరిహారం చెల్లించాల్సిందే
గోకినపల్లిలో సీఎల్పీ లీడర్ కు గోడు వెళ్లబోసుకున్న రైతులు
రాష్ట్రంలో నకిలీ విత్తనాలను అరికట్టడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినందున నష్టపోయిన రైతులకు పరిహారం ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. పీపుల్స్ మార్చ్ లో ప్రజలు ఇచ్చిన ప్రతి విన్నపాన్ని, గుర్తించిన ప్రతి సమస్యను ప్రజల గొంతుకగా అసెంబ్లీలో తన గళం వినిపిస్తానని తెలిపారు. రెండో రోజు సోమవారం పీపుల్స్ మార్చ్ పాదయాత్ర లో భాగంగా ముదిగొండ మండలం గోకినపల్లి గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఖమ్మం జిల్లాలో చాలా మంది రైతులు ప్రత్యామ్నాయంగా మిర్చి, పత్తి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేశారని వివరించారు. రైతులను ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఉచిత సలహాలు ఇవ్వడం తప్ప రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ముదిగొండ మండలం గోకినేపల్లి గ్రామం లో సుమారు 120 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంట కల్తీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోయారన్నారు దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి రైతులకు పూర్తి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాలతో నష్టపోయిన మిర్చి పత్తి మొక్కజొన్న రైతుల సమస్యను అసెంబ్లీలో మాట్లాడతానని వెల్లడించారు.
సిపిఎస్ విధానం ఎత్తివేయాలి
ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఉద్యోగుల గొంతుకనై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సర్కార్ ను నిలదీస్తానని ప్రకటించారు. సకల జనుల సమ్మెలో ఉద్యోగులు క్రియాశీలక పాత్ర పోషించిన విషయాన్ని సీఎం కేసీఆర్ విస్మరించడం తగదన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు అవుతున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేస్తుందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ లో కూడా ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని వెల్లడించారు.
అవినీతి చిట్టా బయట పెట్టడానికి భయమెందుకు?
“సీఎం కేసీఆర్ అవినీతి తమ చేతుల్లో ఉందని కాకుల్లా కావు.. కావు మని” అరిచే బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ బయట పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర కేసీఆర్ అవినీతి చిట్టా ఉంటే ఎందుకు దాస్తుంది అని ప్రశ్నించారు. బ్లాక్ మెయిల్ చేసే ప్రకటనలు వద్దని, చిత్తశుద్ధి
ఉంటే వెంటనే సీఎం అవినీతి చిట్టా బయటపెట్టి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గోకినపల్లిలో సీఎల్పీ లీడర్ కు గోడు వెళ్లబోసుకున్న రైతులు
సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా వరికి బదులు ప్రత్యామ్నాయంగా పొద్దు తిరుగుడు పంట వేస్తే… నకిలీ విత్తనాలతో దిగుబడి రాక నిండా మునిగామని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ముందు గోకినపల్లి రైతులు గోడు వెళ్లబోసుకున్నారు . రైతుల ఆవేదన ఆలకించిన తరువాత వ్యవసాయ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పంట నష్టం అంచనా వేసి నివేదికను వెంటనే ఉన్నతాధికారులకు పంపించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. పంట నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించే విధంగా అసెంబ్లీ సమావేశాల్లో తాను మాట్లాడతానని రైతులకు భరోసా ఇచ్చారు.