ఆంధ్రభూమి ఉద్యోగులకు వెంటనే వేతనాలు ఇవ్వాల్సిందిగా డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఆర్ పి మమత బినానిని NCLT హైదరాబాద్ బెంచ్ బుధవారం ఆదేశించింది. ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మౌఖికంగా జారీచేసిన అదేశాలపట్ల మమత బినాని సానుకూలంగా స్పందిస్తూ న్యాయ స్థానానికి హామీ ఇచ్చింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) హైదరాబాద్ బెంచ్ కోర్టు లో బుధవారం DCHL కేసు విచారణకు రాగా ఆర్ పి మమత బినాని స్వయంగా హాజరయ్యారు. ఆంధ్రభూమి ఉద్యోగుల తరఫున కంపెనీ లా న్యాయ సలహాదారు, కార్పొరేట్ లాయర్ డాక్టర్ ఎస్ వి రామకృష్ణ హాజరై ఆంధ్రభూమి ఉద్యోగులకు ఏడాది కాలంగా వేతనాలు చెల్లించడం లేదని న్యాయ స్థానం దృష్టికి తెచ్చారు. వేతనాలు ఇవ్వక పోవడం వల్ల ఉద్యోగులు కొందరు మానసిక వేదన, అనారోగ్యం తో మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రభూమి మూతపడటం ఉద్యోగులు బజారున పడ్డారని న్యాయవాది రామకృష్ణ న్యాయమూర్తుల దృష్టికి తెచ్చారు. మానవతా దృక్పథంతో స్పందించాలని కోరారు. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం స్పందిస్తూ ఉద్యోగులను ఆదుకోవాలని ఆర్ పి మమత బినానికి సూచించారు. తప్పకుండా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. కోర్టు లో విచారణ ముగిసిన తర్వాత మమత బినానిని ఆంధ్రభూమి ఎంప్లాయీస్ అసోసియేషన్ కన్వీనర్ వెల్జాల చంద్రశేఖర్, అడాహక్ కమిటీ సభ్యులు విజయ ప్రసాద్, జె ఎస్ ఎన్ మూర్తి, స్వామినాథ్, నగేశ్ కలిసి ఆంధ్రభూమి ఉద్యోగులు ఎదురుకుంటున్న ఇబ్బందులను వివరించారు. మీ సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నానని చెప్పారు. తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రభూమి ఉద్యోగుల అంశాన్ని న్యాయ స్థానం దృష్టికి తీసుకవచ్చిన న్యాయవాది రామకృష్ణకు ఉద్యోగుల అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది.
previous post