వేట కొడవలితో కానిస్టేబుళ్ల వెంటపడిన ఐఐటీ పట్టభద్రుడు… ఉగ్రకోణం ఉండొచ్చంటున్న పోలీసులు
- ఉత్తరప్రదేశ్ లో ఘటన
- గోరఖ్ నాథ్ ఆలయం వద్ద యువకుడి అలజడి
- మత నినాదాలు చేస్తూ ఆలయంలోకి ప్రవేశించే యత్నం
- అడ్డుకున్న పోలీసులు
- పదునైన ఆయుధంతో పోలీసులపై దాడికి యత్నం
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లాలో భయభ్రాంతులకు గురిచేసే సంఘటన జరిగింది. ఇక్కడి గోరఖ్ నాథ్ పుణ్యక్షేత్రం వద్ద ఓ ఐఐటీ పట్టభద్రుడు వేట కొడవలితో పోలీసుల వెంటపడడం తీవ్ర కలకలం రేపింది. ఆ యువకుడి పేరు అహ్మద్ ముర్తజా అబ్బాసి. అతడి స్వస్థలం గోరఖ్ పూర్. అతడు 2015లో ప్రతిష్ఠాత్మక ఐఐటీ-బాంబే నుంచి పట్టా పుచ్చుకున్నాడు.
కాగా, గోరఖ్ నాథ్ ఆలయం వద్ద మతపరమైన నినాదాలు చేస్తూ అలజడి సృష్టించాడు. ఆలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసు కానిస్టేబుళ్లు అతడిని అడ్డుకోబోయారు. దాంతో, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ఐఐటీ గ్రాడ్యుయేట్ పదునైన ఆయుధాన్ని బయటికి తీసి పోలీసులపైకి ఉరికాడు. దాంతో పోలీసులు పరుగులు తీశారు. దాంతో, అక్కడి దుకాణదారులు, స్థానికులు ఆ యువకుడిపైకి రాళ్లు విసిరారు. కొద్దిసేపటి తర్వాత ఆ యువకుడిని అదుపులోకి తీసుకోగలిగారు.
అతడి నుంచి ఓ ల్యాప్ టాప్, ఫోన్, ఓ టికెట్ ను స్వాధీనం చేసుకున్నారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను బట్టి చూస్తే, దీని వెనుక భారీ ఉగ్ర కుట్ర ఉండే అవకాశం లేకపోలేదని పోలీసులు అభిప్రాయపడ్డారు. అతడిపై రెండు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఎంతో ప్రసిద్ధి చెందిన గోరఖ్ నాథ్ ఆలయానికి ప్రధాన పూజారి ఎవరో కాదు… ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్!
కాగా, ఐఐటీ గ్రాడ్యుయేట్ అహ్మద్ ముర్తజా అబ్బాసి దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారికి బీఆర్డీ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిద్దరినీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసుపత్రిలో పరామర్శించారు. అటు, ఆ యువకుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతడిని కూడా ఆసుపత్రికి తరలించారు. అతడి చేయి విరిగినట్టు తెలుస్తోంది.