- భారత్‌లోని రైతులు భిక్షగాళ్లు కాదన్నా కేసీఆర్
- ఒకే విధానం లేకపోతే వారు రోడ్లపైకి వస్తారని హెచ్చరిక
- తెలంగాణ నుంచి ఇంత దూరం వచ్చి దీక్ష చేస్తున్నామన్న సీఎం
- రైతులతో మాత్రం పెట్టుకోవద్దని వార్నింగ్
ఢిల్లీలో చేస్తోన్న దీక్షలో కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చరిత్రను చూస్తే హిట్లర్, నెపోలియన్ వంటి అహంకారులు కూడా కాలగర్భంలో కలిసిపోయినట్లు తెలుస్తుందని అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా అహంకారంతో మాట్లాడుతున్నారని, ఆయనకు రైతులపై ఏమాత్రం అవగాహన లేదని అన్నారు.
తెలంగాణ రైతులను, మంత్రులను అవహేళన చేస్తూ పీయూష్ గోయల్ ఇటీవల మాట్లాడారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతులు నూకలు తినాలని ఆయన చెప్పారని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేనన్ని బోర్లు తెలంగాణలో ఉన్నాయని, మోటార్, విద్యుత్ తీగలు, బోర్ల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అన్నారు.
తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేశామని చెప్పారు. ధాన్యం సేకరణకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేశారు. కేంద్ర సర్కారుపై పోరాటానికి తెలంగాణ ప్రజలు, అన్నదాతలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల డెడ్‌లైన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
భారత్‌లోని రైతులు భిక్షగాళ్లు కాదని, ఒకే విధానం లేకపోతే వారు రోడ్లపైకి వస్తారని అన్నారు. తాము తెలంగాణ నుంచి ఇంత దూరం వచ్చి దీక్ష చేస్తున్నామని, ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఎవరితోనైనా పెట్టుకోవచ్చని, కానీ రైతులతో మాత్రం పెట్టుకోవద్దని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఉద్యమాల ఫలితంగా 2014లో తెలంగాణ వచ్చిందని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో తాము అనేక సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. తెలంగాణలో రైతులకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని, సాగు నీటి ప్రాజెక్టులు చేపట్టామని కేసీఆర్ వివరించారు.