నగదు బదిలీ యోచనలో ఏపీ పౌరసరఫరాల శాఖ.. బియ్యం వద్దనుకునే వారికి కిలోకు రూ. 12 ఇవ్వాలని నిర్ణయం!
- వచ్చే నెల నుంచి ప్రయోగాత్మకంగా అమలు
- తొలి దశలో అనకాపల్లి, గాజువాక, నర్సాపురం, నంద్యాల, కాకినాడలో అమలు
- దశల వారీగా అన్ని ప్రాంతాలకు విస్తరణ
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డుదారులకు నగదు బదిలీని అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. లబ్ధిదారులు రేషన్ బియ్యం వద్దంటే వారికి ఆ మేరకు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే నెల నుంచే దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని యోచిస్తోంది. బియ్యానికి బదులుగా డబ్బులు తీసుకునేందుకు అంగీకరించే లబ్ధిదారులకు ప్రతి నెల నగదు చెల్లిస్తారు. మొదట కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఆపై అన్ని ప్రాంతాలకు విస్తరిస్తారు.
తొలి దశలో భాగంగా అనకాపల్లి, గాజువాక, నర్సాపురం, నంద్యాల, కాకినాడలో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. నగదు బదిలీకి సంబంధించి ఎంపిక చేసిన ప్రాంతాల్లోని వలంటీర్ల ద్వారా ఈ నెల 18 నుంచి 22 వరకు అంగీకార పత్రాలు తీసుకుంటారు. 23న వీఆర్వో పరిశీలన, 25న తహసీల్దార్ ఆమోదం తీసుకుంటారు.
అయితే, కిలో బియ్యానికి ఎంత చెల్లించాలన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. రూ. 12 నుంచి రూ. 15 మధ్య ఇచ్చే అవకాశం ఉందని మాత్రం తెలుస్తోంది. బియ్యానికి బదులుగా నగదు కావాలని అంగీకార పత్రం ఇచ్చే వారికి ఆ తర్వాత కావాలంటే మళ్లీ బియ్యం ఇస్తారు. తొలుత వలంటీర్ల ద్వారా నగదు చెల్లించాలని, ఆ తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులు యోచిస్తున్నట్టు సమాచారం.