కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంటిపై రాళ్లదాడి.. కారు ధ్వంసం!
-హైదరాబాద్ అంబర్‌పేటలోని వీహెచ్ ఇంటిపై దాడి
-పీసీసీ చీఫ్‌గా, ఎంపీగా పనిచేసిన తనకే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన
-కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. హైదరాబాద్ అంబర్‌పేటలోని ఆయన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఈ దాడికి పాల్పడ్డారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారును కూడా ధ్వంసం చేశారు. తన ఇంటిపై జరిగిన రాళ్లదాడిపై వీహెచ్ స్పందించారు. దాడికి పాల్పడినవారిని గుర్తించాల్సింది పోలీసులేనని అన్నారు.
పీసీసీ అధ్యక్షుడిగా, ఎంపీగా పనిచేసిన తనకే రక్షణ లేకుండా పోయిందని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. తన కారును ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీహెచ్ ఇంటిపై రాళ్ల దాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వీహెచ్ ఇంటిపై రాళ్లదాడి నేపథ్యంలో ఆయనకు ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్, అంబర్‌పేటలోని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇంటిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై టీపీసీసీ నేతలు మండిపడుతున్నారు. వీహెచ్‌తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోనులో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
దాడి జరిగిన తీరుపై ఆయనకు వీహెచ్ వివరించారు. వీహెచ్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. కాంగ్రెస్ నేతలపై దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో రోజు రోజుకూ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆయన చెప్పారు. వి.హనుమంతరావు ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
వీహెచ్ ఇంటిపై దాడి కేసు.. పోలీసుల అదుపులో నిందితుడు సిద్ధార్థ్!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఇంటిపై జరిగిన దాడి తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మరుక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు దాడికి పాల్పడ్డ వ్యక్తి ఎవరన్న కోణంలో విచారణ మొదలుపెట్టారు.
దాడికి సంబంధించి రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. ఎట్టకేలకు నిందితుడు ఎవరన్న విషయాన్ని నిగ్గు తేల్చారు. అంతేకాకుండా అతడిని అదుపులోకి కూడా తీసుకున్నారు. వీహెచ్ ఇంటిపై దాడికి పాల్పడ్డ వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన సిద్ధార్థ్‌గా గుర్తించిన పోలీసులు.. కొన్ని గంటల వ్యవధిలోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే అతడి అరెస్ట్‌ను పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. యూపీకి చెందిన వ్యక్తి వీహెచ్ ఇంటిపై దాడి చేయడానికి గల కారణమేమిటన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇదే విషయంపై పోలీసులు నిందితుడి నుంచి వివరాలు రాబట్టే యత్నం చేస్తున్నట్లుగా సమాచారం.