చంచల్‌గూడ జైల్లోకి రాహుల్, భట్టిలకే అనుమతి, రేవంత్‌కు నో ఎంట్రీ… కారణమేంటంటే..!
- చంచల్‌గూడ జైల్లో ఎన్ఎస్‌యూఐ నేతలకు రాహుల్ పరామర్శ
- ఏఐసీసీ లేఖతోనే రాహుల్‌కు జైల్లోకి అనుమతి
- రాహుల్ వెంట భట్టి విక్రమార్కను అనుమతించాలన్న మాణిక్కం ఠాగూర్
తెలంగాణ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో కలిసి చంచల్‌గూడ జైలుకు వెళ్లిన రాహుల్.. తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన పార్టీ విద్యార్ధి విభాగం ఎన్ఎస్‌యూఐ నేతలను అక్కడ కలిశారు. అరెస్టులకు భయపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎన్ఎస్‌యూఐ నేతలకు రాహుల్ భరోసా ఇచ్చారు.
చంచల్‌గూడ జైలు సందర్శనలో భాగంగా రాహుల్ వెంట మల్లు భట్టి విక్రమార్క మినహా మరెవ్వరినీ పోలీసులు జైలులోకి అనుమతించలేదు. చివరకు రాహుల్ పర్యటనను తన భుజస్కందాలపై వేసుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా పోలీసులు అనుమతించలేదు. దీనికి కారణమేంటంటే.. టీపీసీసీ తరఫున చంచల్‌గూడ జైలు సందర్శనకు రాహుల్‌కు అనుమతివ్వాలంటూ రేవంత్ ఓ లేఖ రాశారు. అయితే ఆ లేఖకు జైళ్ల శాఖ సానుకూలంగా స్పందించలేదు.
ఈ నేపథ్యంలో నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఏఐసీసీ నుంచి తెలంగాణ జైళ్ల శాఖకు ఓ అర్జీ అందింది. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ సంతకంతో వచ్చిన ఆ లేఖతో ఎట్టకేలకు జైళ్ల శాఖ రాహుల్ జైలు సందర్శనకు అనుమతించింది. అయితే ఆ లేఖలో మాణిక్కం ఠాగూర్.. జైలు లోపలికి రాహుల్‌తో పాటు భట్టి విక్రమార్కను మాత్రమే అనుమతించాలని కోరారట. రేవంత్ పేరును అసలు ప్రస్తావించలేదట. ఈ కారణంగానే రాహుల్ వెంట చంచల్ గూడ జైల్లోకి ఒక్క భట్టి విక్రమార్కను మాత్రమే అనుమతించిన పోలీసులు… రేవంత్ రెడ్డిని అనుమతించలేదు.