చెన్నైలో ఉన్నట్టుండి బైక్ లో మంటలు.. గాయాలతో తప్పించుకున్న యజమాని!
పూర్తిగా కాలిపోయిన వాహనం
కొద్ది సమయం పాటు నిలిచిన ట్రాఫిక్
సరైన నిర్వహణ లేకపోవడం వల్లే ప్రమాదాలు
చెన్నైలోని మండవేలి ప్రాంతంలో బుధవారం రాత్రి కలకలం నెలకొంది. నడుస్తున్న బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులు ఉలిక్కిపడ్డారు. వాహనం నడుపుతున్న రామలింగం అనే వ్యక్తి వెంటనే బైక్ ను వదిలేసి దూరంగా వెళ్లిపోవడంతో గాయాలతో బయటపడ్డాడు.
ఇక అగ్నిమాపక శకటం వచ్చే సరికే మంటల ధాటికి బైక్ వేగంగా తగలబడిపోయింది. ఈ ఘటన ఆ మార్గంలో వెళ్లే వారిలో భయాన్ని కలిగించింది. వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అవాంతరం ఏర్పడింది. గత నెల మొదట్లో ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం పట్టణంలో రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనం సైతం అగ్నికి ఆహుతి అవ్వడం తెలిసిందే. ఆలయం ముందు పార్క్ చేసి ఉండగా ఒక్కసారిగా బ్లోఅవుట్ మాదిరిగా పేలుడు జరిగి వాహనం కాలిపోయింది.
కొత్తగా కొనుగోలు చేసిన రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనంతో రవిచంద్ర అనే వ్యక్తి కర్ణాటకలోని మైసూర్ నుంచి గుంతకల్ మండలంలోని నెట్టికంటి ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చాడు. 400 కిలోమీటర్ల పాటు నాన్ స్టాప్ గా బైక్ నడుపుకుని వచ్చి, తర్వాత స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది.
కారణాలు..
బైక్ లు లేదా స్కూటర్లలో అగ్ని ప్రమాదాలు జరగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ముఖ్యంగా నాణ్యమైన బ్యాటరీ వాడకపోవడం, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరగడం, ఇంధన లీకేజీలు ప్రమాదాలకు కారణమవుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. కార్బురేటర్ నుంచి లీకేజీ ఉన్నప్పుడు, వాహనం వైరింగ్ దెబ్బతిన్నప్పుడు, ఎక్కువ వేగంతో నాన్ స్టాప్ గా దూరం ప్రయాణించినప్పుడు ఒత్తిడికి లోనై ఇలాంటి ప్రమాదాలు తలెత్తుతుంటాయి. అందుకని ఎప్పటికప్పుడు సరైన నిర్వహణతోపాటు.. వైరింగ్ ను, బ్యాటరీని చెక్ చేయించుకుంటూ ఉండాలి. అరిగిపోయిన టైర్లతో ఎక్కువ రోజుల పాటు వాహనాన్ని నడపడం కూడా ప్రమాదాలకు దారితీస్తుంది.