ఇది జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ: సోము వీర్రాజు
- నిలిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
- ఏపీలో పరిషత్ ఎన్నికలపై కోర్టు స్టే
- హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న సోము
- ఏపీలో వ్యవస్థల దుర్వినియోగాన్ని కోర్టు ఎత్తిచూపిందని వ్యాఖ్య
ఏపీలో పరిషత్ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని మొదటి నుంచి బీజేపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిలుపుదల చేస్తూ హైకోర్టు స్టే ఇవ్వగా, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు.
హైకోర్టు నిర్ణయంతో జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యవస్థలు దుర్వినియోగం అవుతుండడాన్ని హైకోర్టు ఎత్తిచూపిందని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బీజేపీ తరఫున హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్టు సోము వీర్రాజు వెల్లడించారు.