ఏఐసీసీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన పోలీసులు…
-నిరసనగా రేపు రాజ్ భవన్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు
-మూడో రోజు ఈడీ విచారణకు రాహుల్ గాంధీ
-ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్‌కు సంఘీభావంగా నేతల దీక్షలు
-కార్యాలయానికి భారీగా చేరుకున్న కార్యకర్తలు
-ఆఫీస్‌లోకి చొచ్చుకెళ్లిన పోలీసులు
-పోలీసుల వైఖరికి నిరసనగా ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
రాహుల్ గాంధీ ఈడీ విచారణ మూడవ రోజు కోనసాగుతుంది. దీనికి నిరసనగా ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోకి పోలీసులు చొరబడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు . దీనికి నిరసనగా రేపు అన్నిరాష్ట్రాల్లోని రాజ్ భవన్ ల ముట్టడికి పిలుపునిచ్చారు. వరసగా రాహుల్ గాంధీని మూడు రోజులుగా విచారించడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. దేశవ్యాప్తిగా చర్చకు దారితీసింది. ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య వైరంగా మారింది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న వైనంపై గడచిన మూడు రోజులుగా ఆ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏఐసీసీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు దీక్షలు కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో తొలి రోజు ఆందోళనల్లో ఓ మోస్తరు తోపులాట చోటుచేసుకుంది. తాజాగా బుధవారం మాత్రం పార్టీ శ్రేణులపై పోలీసులు విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి బయలుదేరుతున్న సందర్భంగా పార్టీ కార్యాలయానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అడ్డగించగా.. ప్రతిగా కార్యకర్తలు కూడా పోలీసులకు ఎదురు తిరిగారు.
ఈ క్రమంలో ఏఐసీసీ కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లిన పోలీసులు… అప్పటికే అక్కడ ఆందోళనకు దిగిన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఏఐసీసీ కార్యాలయం గేట్లను బద్దలు కొట్టారంటూ పార్టీ నేతలు ఆరోపించారు. అంతేకాకుండా తమ పార్టీ శ్రేణుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. పోలీసుల తీరుకు నిరసనగా గురువారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజ్ భవన్‌లను ముట్టడించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి రావాలని పార్టీ పిలుపునిచ్చింది.