రాష్ట్రపతి భవన్ ఎదుట రేవంత్ రెడ్డి నినాదాల హోరు!
- అగ్నిపథ్, రాహుల్ ఈడీ విచారణపై కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
- అనంతరం పార్లమెంటులో పార్టీ అత్యవసర సమావేశం
- హాజరైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
- రాష్ట్రపతితో భేటీకి ఆరుగురు కాంగ్రెస్ నేతలకే అనుమతి
- ఇందుకు నిరసనగా రాష్ట్రపతి భవన్ ఎదుట రేవంత్ నినాదాలు
అగ్నిపథ్ పథకం, రాహుల్ గాంధీ ఈడీ విచారణలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన సత్యాగ్రహ దీక్షకు టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. దీక్షలో భాగంగా బీజేపీ సర్కారు అవలంబిస్తున్న కక్షపూరిత రాజకీయాలపై ఆయన నిప్పులు చెరిగారు. ఈ దీక్ష అనంతరం పార్లమెంటు భవన్‌లో కాంగ్రెస్ నిర్వహించిన అత్యవసర సమావేశానికి కూడా ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత పార్టీ సీనియర్లతో కలిసి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసేందుకు పాదయాత్రగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.
అయితే రాష్ట్రపతిని కలిసేందుకు కేవలం ఆరుగురు కాంగ్రెస్ నేతలకే అధికారులు అనుమతి ఇచ్చారు. పార్టీ సీనియర్లు మల్లికార్జున ఖర్గే, చిదంబరం, జైరాం రమేశ్, అశోక్ గెహ్లాట్, భూపేష్ బాఘెల్, ఆధిర్ రంజన్ చౌదరిలను మాత్రమే రాష్ట్రపతి భవన్‌లోకి అనుమతించారు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి రాష్ట్రపతి భవన్ ఎదుట పెద్ద పెట్టున నినాదాలు చేశారు.