విపక్ష నేతలకు జేపీ నడ్దా ఫోన్… ముర్మును ఏకగ్రీవంగా ఎన్నుకుందామని పిలుపు!
-రాష్ట్రపతిగా ముర్మును ఏకగ్రీవం చేసుకునే యత్నాలు షురూ
-విపక్ష నేతలతో చర్చలకు రంగంలోకి దిగిన జేపీ నడ్డా
-కాంగ్రెస్, ఎన్‌సీ, జేడీఎస్ నేతలకు నడ్డా ఫోన్లు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్మును ఏకగ్రీవంగా ఎన్నుకునేలా బీజేపీ అధిష్ఠానం చర్యలు చేపట్టింది. ఎన్డీఏ అభ్యర్థిగా ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రకటించకముందే… అభ్యర్థి ఎవరైనా ఏకగ్రీవంగానే ఎన్నుకుందామంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విపక్షాలకు చెందిన నేతలతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.
తాజాగా విపక్షాలన్నీ కలిసి కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను తమ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం.. ఆ వెంటనే ఎన్డీఏ కూడా తన అభ్యర్థిగా ఒడిశాకు చెందిన గిరిజన సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్మును ఖరారు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ముర్మును ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకునే దిశగా మరోమారు జేపీ నడ్డా రంగంలోకి దిగారు.
ఇందులో భాగంగా ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లికార్జున ఖర్గే, ఆధిర్ రంజన్ చౌదరి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, జేడీఎస్ నేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడలకు ఫోన్ చేశారు. ద్రౌపది ముర్ములాంటి నేతలను రాష్ట్రపతిగా ఎన్నుకునే విషయంలో రాజకీయాలను పక్కనపెట్టాలని ఈ సందర్భంగా ఆయన వారిని కోరారు. అయితే జేపీ నడ్డా వినతికి ఆయా పార్టీల నేతలు ఎలా స్పందించారన్నది తెలియరాలేదు.