కేసు నమోదు చేసిన వెంటనే అరెస్ట్ కుదరదు: రఘురామకృష్ణరాజు పిటిషన్ పై ఏపీ హైకోర్టు!
- మోదీ పర్యటనలో తనకు రక్షణ కల్పించాలన్న రఘురామకృష్ణరాజు
- హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన వైనం
- కేసు నమోదు, వ్యక్తుల అరెస్ట్‌లో చట్టబద్ధ ప్రక్రియ పాటించాలన్న కోర్టు
ఏ వ్యవహారంలో అయినా, ఏ వ్యక్తిపైన అయినా కేసు నమోదు చేసి.. ఆ వెంటనే సదరు వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వీల్లేదని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులు నమోదు చేసినప్పటికీ వ్యక్తుల అరెస్ట్‌లో పోలీసులు చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 4న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. స్థానిక ఎంపీ హోదాలో ఈ కార్యక్రమానికి తాను హాజరు కావాల్సి ఉందని, అయితే తనను ఈ కార్యక్రమంలో పాలుపంచుకోకుండా ముందుగానే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తనను అరెస్ట్ చేయకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని రఘురామరాజు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కేసు నమోదు విషయంలోనూ పోలీసులు చట్టబద్ధ ప్రక్రియను అనుసరించాలని సూచించింది. ఈ నెల 3, 4 తేదీల్లో రఘురామపై కేసులు నమోదు చేసినా… అరెస్ట్ విషయంలో మాత్రం చట్టబద్ధ ప్రక్రియను అనుసరించాలని పోలీసులకు సూచించింది. ఈ సందర్భంగా ‘ఎంపీగా ఉన్నారు కదా… ప్రధాని మోదీ కార్యక్రమానికి వెళ్లవచ్చు కదా?’ అంటూ హైకోర్టు వ్యాఖ్యానించగా… పోలీసులు ఏదోలా తనను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నారని రఘురామ తెలిపారు.