వైసీపీ ప్లీనరీ నేపథ్యంలో హైవేపైనే నిలిచిపోనున్న భారీ వాహనాలు… రాత్రి 10 తర్వాతే వాటికి అనుమతి!
- శుక్ర, శనివారాల్లో విజయవాడ పరిధిలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు
- ప్రత్యామ్నాయ మార్గాలను ప్రకటించిన పోలీసులు
- భారీ వాహనాలకు రాత్రి 10 గంటల తర్వాతే అనుమతి
ఏపీలో అధికార పార్టీ వైసీపీ ప్లీనరీ సమావేశాలు శుక్ర, శనివారాల్లో గుంటూరు జిల్లా పరిధిలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో జరగనున్న సంగతి తెలిసిందే. కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారిని ఆనుకుని సమావేశాలు ఏర్పాటు చేస్తున్నందున జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో వాహనదారులకు రెండు రోజులపాటు ఇబ్బందులు తప్పేట్లు లేదు …అయితే దారిమళ్లించినప్పటికీ కొన్ని భారీ వాహనాలు మళ్లించినదారినుంచి వెళ్ళటం ఇబ్బంది కావడంతో అవి రాత్రి 10 గంటలవరకు ఆగాల్సిందే …
సమావేశాలు జరుగుతున్న సమయంలో విజయవాడ, గుంటూరు మధ్య జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, గుంటూరు రేంజి డీఐజీ త్రివిక్రమ్ వర్మ గురువారం తెలిపారు. ప్లీనరీ జరిగే రెండు రోజులూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జాతీయ రహదారిపై వాహనాలకు అనుమతి లేదని వారు తెలిపారు.
చెన్నై నుంచి విశాఖపట్నం, కోల్ కతా వెళ్లే వాహనాలను ప్రకాశం జిల్లా త్రోవగుంట వద్ద జాతీయ రహదారి నుంచి మళ్లిస్తామని పోలీసులు తెలిపారు. చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్‌ల మీదుగా వాహనాలను దారి మళ్లిస్తారు. అదే విధంగా విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచే దారి మళ్లించి పై మార్గం మీదుగా ప్రకాశం జిల్లా త్రోవగుంట వద్ద జాతీయ రహదారి ఎక్కేలా చేస్తారు.
ఇక గుంటూరు నుంచి విశాఖ వెళ్లే వాహనాలను బుడంపాడు మీదుగా తెనాలి, కొల్లూరు, పెనుమూడి వారధి, అవనిగడ్డ, పామర్రు, హనుమాన్ జంక్షన్ మీదుగా దారి మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను విజయవాడ నగరంలోకి వెళ్లకుండా హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు మీదుగా ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారిపైకి మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వాహనాలను ఇబ్రహీంపట్నం నుంచి దారి మళ్లించి నూజివీడు మీదుగా హనుమాన్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపైకి మళ్లిస్తారు.
ఇక ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లలేని భారీ వాహనాలను ఆయా జాతీయ రహదారులపైనే నిలిపివేయనున్నారు. విశాఖ నుంచి చెన్నై వెళ్లనున్న భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్, పొట్టిపాడు టోల్ గేట్ వద్దే నిలిపివేయనున్నారు. చెన్నై నుంచి విశాఖ వెళ్లే భారీ వాహనాలను చిలకలూరుపేట, ఒంగోలు వద్దే జాతీయ రహదారిపై నిలిపివేయనున్నారు. రాత్రి 10 గంటల తర్వాత ఈ వాహనాల రాకపోకలను అనుమతించనున్నారు.