పార్లమెంటు నుంచి తల్లి సోనియాతో కలిసి ఒకే కారులో వెళ్లిన రాహుల్ గాంధీ…
- పార్లమెంటు వద్ద సందడి వాతావరణం
- తల్లి సోనియా రాక కోసం వేచి చూసిన రాహుల్
- వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కాంగ్రెస్ శ్రేణులు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం, రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా పార్లమెంటు ఆవరణలో సోమవారం పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తన తల్లి పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కలిసి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. అనంతరం పార్లమెంటు నుంచి ఇంటికెళ్లే సమయంలో ఆయన తన తల్లి కారులోనే వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా పార్లమెంటు భవనం నుంచి ఒకింత ముందుగానే బయటకు వచ్చిన రాహుల్ గాంధీ.., సోనియా రాక కోసం గేటు వద్ద నిరీక్షించారు. సోనియా వచ్చిన తర్వాత ఆమెతో కలిసి ముందుకు సాగారు. అనంతరం కారు వెనుక సీటులో రాహుల్ కూర్చోగా… సోనియా గాంధీ ముందు సీట్లో కూర్చున్నారు. ఒకే కారులో తల్లీకొడుకులు కలిసి బయలుదేరారు. ఈ వీడియోను కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి.