ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్‌కు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు!
- అమలాపురంలో వైఎస్సార్ వర్ధంతికి హాజరైన రవాణా శాఖ మంత్రి
- కార్యక్రమం అనంతరం అస్వస్థతకు గురైన వైనం
- రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు
ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ శుక్రవారం మధ్యాహ్నం ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న విశ్వరూప్… శుక్రవారం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా అమలాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఉత్సాహంగా కనిపించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళి అర్పించిన కాసేపటికే విశ్వరూప్ అస్వస్థతకు గురయ్యారు. విశ్వరూప్ పరిస్థితిని గమనించిన పార్టీ శ్రేణులు వెనువెంటనే ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. ఆ తర్వాత విశ్వరూప్‌ను హుటాహుటీన రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఏ కారణం చేత విశ్వరూప్ అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలియరాలేదు.