ఖర్గేకు సోనియా అభినందనలు… ఇంటికెళ్లి మరీ గ్రీటింగ్స్ చెప్పిన వైనం!
- కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గే
- ప్రియాంకతో కలిసి ఖర్గే నివాసానికి వెళ్లిన సోనియా
- ఖర్గే సతీమణికీ సోనియా ఆత్మీయ పలకరింపు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గేకు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన పోలింగ్ సోమవారం జరగగా… బుధవారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఫలితాల్లో తన ప్రత్యర్థి శశిథరూర్ పై ఖర్గే భారీ మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల కమిటీ నుంచి ప్రకటన రాగానే… తన కూతురు ప్రియాంకా గాంధీని వెంటబెట్టుకుని సోనియా గాంధీ… నేరుగా ఖర్గే నివాసానికి వెళ్లారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఖర్గేకు సోనియా గాంధీ అభినందనలు తెలిపారు. పార్టీకి సంబంధించిన కీలకమైన బాధ్యతల్లో మెరుగ్గా రాణించాలని ఈ సందర్భంగా ఆమె ఖర్గేకు సూచించారు. తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా ఆమె ఖర్గేకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఖర్గే సతీమణికి కూడా సోనియా గాంధీ అభినందనలు తెలిపారు.