ఐజేయూ వ్యవస్థాపక అధ్యక్షులు సంతోష్ కుమార్ కన్నుమూత
-1928 లో పాకిస్తాన్ లో ఆయన జననం
-మంచి ట్రేడ్ యూనియన్ నేతగా గుర్తింపు
-ఇండియన్ జర్నలిస్ట్ ఉద్యమ నిర్మాణంలో ప్రముఖుడు
-స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు
– శ్రీనివాస్ రెడ్డి ,అమర్ బల్విందర్ జమ్మూ, సిన్హా నరేందర్ రెడ్డి ల సంతాపం
ఐజేయూ వ్యవస్థాపక అధ్యక్షులు, స్ఫూర్తిదాయక నేత కామ్రేడ్ సంతోష్ కుమార్ శుక్రవారం ఉదయం ఢిల్లీలో కన్నుమూశారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు. ఆయనకు ఒక కుమార్తె ఉన్నారు. భార్య కొద్ధి సంవత్సరాల క్రితం మరణించారు. ఆయన భౌతిక కాయానికి మధ్యాహ్నం ఢిల్లీలోని లోధీ శ్మశాన వాటికలో అంత్య క్రియలు జరిగాయి.
సంతోష్ కుమార్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే) అధ్యక్షుడుగా కూడా పని చేశారు. ఢిల్లోని అనేక ప్రముఖ దినపత్రికల ప్లాంట్ యూనియన్లకు నాయకత్వం వహించారు. పశ్చిమ పాకిస్తాన్ లో జన్మించిన సంతోష్ కుమార్ ఢిల్లీలో స్థిరపడ్డారు. ప్రతాప్ అనే ఉర్దూ దినపత్రిక న్యూస్ ఎడిటర్ గా రిటైర్ అయిన సంతోష్ ఎఐటియుసి అధికార పత్రిక ట్రేడ్ యూనియన్ రికార్డ్ కు సంపాదకుడుగా పని చేశారు. సంతొష్ కుమార్ మృతి పట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ ) ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. ఐజేయూ సంస్థాగత నిర్మాణానికి, దేశంలో జర్నలిస్టు ఉద్యమ నిర్మాణానికి ఎనలేని కృషి చేశారని ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, సెక్రెటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ, ఐజేయూ మాజీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార, అంతర్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దేవులపల్లి అమర్, మరో మాజీ అధ్యక్షుడు ఏస్.ఎన్. సిన్హా కొనియాడారు. తన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలతో సంతోష్ కుమార్ ఐజేయూ శ్రేణులను ఉత్తేజపర్చేవారని వారు శ్లాఘించారు. ఆయన లేని లోటు తీరనిదని వ్యాఖ్యానించారు.సంతోష్ కుమార్ మృతి పట్ల ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె.సత్యనారాయణ, దాసరి కృష్ణారెడ్డి, డి.సోమసుందర్, ఆలపాటి సురేశ్ కుమార్, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు ఎం.ఏ. మాజిద్, టీయూడబ్ల్యుజే అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఏపీయూడబ్ల్యుజే అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ ప్రగాఢ సంతాపంతెలిపారు.