Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నేను వెళ్లను.. మీరు గెంటేయండి..? ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి !

నేను వెళ్లను.. మీరు గెంటేయండి..? ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి !
-కోమటిరెడ్డి బ్రదర్స్ ద్రోహంపై కాంగ్రెస్ కార్యకర్తల మండిపాటు
-కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేయడంపై విమర్శలు
-పీసీసీ అధ్యక్ష పదవి రాలేదని చెట్టుకొమ్మలను నరుకుతున్న వైనం
-కాంగ్రెస్ లో హీరోలుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ విలన్లు అయ్యారు

నేను వెళ్ళాను… మీరే గెంటి వేయండి …ఇది ఎవరో అన్నమాట కాదు …ఒక బాధ్యతగల కాంగ్రెస్ ఎంపీ , కాంగ్రెస్ లో అనేకపదవులు అనుభవించి పార్టీలోనే ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తున్నాడంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి . కన్నతల్లి లాంటి పార్టీని కాదని బీజేపీలో చేరిన ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా ఉపఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాడని వస్తున్నా ఆరోపణలపై వివరణ ఇవ్వకుండా కాంగ్రెస్ ను బలహీనపర్చాలని ,నష్ట పరచాలని ఉద్దేశంతో పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండటంపై విమర్శలు వెల్లువ ఎత్తుతున్నాయి. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది.అయితే ఆయనంతట ఆయన వెళ్లడమా ? పార్టీ చర్యలు తీసుకోవడమా ? అనేదే సమస్య…

కన్నతల్లి లాంటి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకోవడం ఇటువంటివారి కనీస బాధ్యత. అలా జరగనప్పుడు పార్టీ శ్రేణులనుంచే కాకుండా అన్నివర్గాల నుంచి వారిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సరిగ్గా ఇటువంటి సందర్భాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎదుర్కొంటున్నారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవదని, తాను తిరిగినా 10వేల ఓట్లు వస్తాయని, తన తమ్ముడే గెలుస్తాడంటూ ఆస్ట్రేలియా పర్యటనలో వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో వీటిపై వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నోటీసులు జారీచేసింది. అయితే పార్టీ నోటీసులతో సరిపెడుతుందా? కఠిన చర్యలు తీసుకుంటుందా? అనే మీమాంస కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ ప్రాభవాన్ని తగ్గించేందుకు, బలహీనపరిచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడుతున్నారు.

ఇప్పటికే కోమటిరెడ్డిపై అధిష్టానానికి తామరతుంపరలుగా ఫిర్యాదులు అందుతున్నాయి. షబ్బీర్ అలీపై అభాండాలు వేయడంతోపాటు హైకమాండ్ కు లేఖ రాయడంతోనే ఆయన పార్టీలో ఉంటారా? లేదా? అనేది స్పష్టమవుతోందని చెబుతున్నారు. అందుకే సంజాయిషీ ఇవ్వాలంటూ నోటీసులు జారీచేసిందని చెబుతున్నారు. ఇతరత్రా పరిస్థితుల్లో అయితే కచ్చితంగా ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించేవారని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.

ఈ విషయంపై వెంకటరెడ్డికి అవగాహన ఉంది కాబట్టే ఇతర నేతలపై విమర్శలు చేయడంతోపాటు అందరిముందు పార్టీని కించపరిచేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. పార్టీ నుంచి ఆయనంతట ఆయనగా వెళ్లే ఉద్దేశం లేదని, బహిష్కరిస్తే ఆ సానుభూతితో తనకు మంచి పేరు వచ్చేలా చూసుకోవచ్చని ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. అయితే అధిష్టానం తొందరపడకుండా అలాగే ఉంటే ఓర్పు నశించి ఆయనే వెళ్లిపోతారని, అధిష్టానం తొందరపడి ఆయనపై చర్యలు తీసుకుంటే దాన్ని తన ప్రచారానికి ఉపయోగిస్తారని, మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగుతున్న సమయంలో ప్రజల దృష్టి అటువైపునకు మళ్లుతుందంటున్నారు. తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ముగియగానే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

 

Related posts

ఈటల భారీ కుట్రకు ప్లాన్ చేశారు: మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన ఆరోపణలు!

Drukpadam

రాహుల్ గాంధీతో భేటీ అయిన ప్రశాంత్ కిశోర్…

Drukpadam

భయపడితే కోలుకోలేని దెబ్బ తింటాం…చంద్రబాబు

Drukpadam

Leave a Comment