మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం!
-నవంబరు 3న మునుగోడులో పోలింగ్
-నవంబరు 6న ఓట్ల లెక్కింపు
-ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్
-మధ్యాహ్నం వేళకు విజేతపై స్పష్టత వచ్చే అవకాశం
ఈ నెల 3న మునుగోడులో ఉప ఎన్నిక పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు (నవంబరు 6) ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ గురువారం చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే ముగిసింది. తెలంగాణలో ఇప్పటిదాకా ఏ ఎన్నికపై జరగనంత చర్చ మునుగోడు ఉప ఎన్నికపై జరిగింది. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కూడా అప్పటిదాకా నమోదైన రికార్డులను బద్దలు కొట్టేసింది. ఈ ఉప ఎన్నికల్లో 93.13 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఇప్పటిదాకా నమోదైన అత్యధిక పోలింగ్ శాతం ఇదే కావడం గమనార్హం.
2018 ఎన్నికల్లోనూ మునుగోడులో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. నాడు మునుగోడులో 91.07 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అదే సమయంలో 2018 ఎన్నికల్లోనే ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో 91.27 శాతం పోలింగ్ నమోదైంది. ఫలితంగా తెలంగాణలో మొన్నటిదాకా అత్యధిక పోలింగ్ శాతంగా 91.27 శాతమే కొనసాగింది. తాజాగా మధిర రికార్డును బద్దలు కొట్టిన మునుగోడు ఉప ఎన్నిక ఏకంగా 93.13 శాతం పోలింగ్ తో అత్యధిక పోలింగ్ గా రికార్డులకెక్కింది. గురువారం మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగియగా… ఆదివారం కౌంటింగ్ జరగనున్నది .
ఓట్ల లెక్కింపునకు నల్గొండలోని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్ వేదికగా నిలవనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 15 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం సమయానికి విజేత ఎవరన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
కాగా, మునుగోడు ఓట్ల లెక్కింపునకు సంబంధించి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. నేడు డమ్మీ ఈవీఎంలతో మాక్ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేశారు.