బెంగాల్ ఎన్నికల్లో పెను సంచలనం… నందిగ్రామ్ లో మమతా బెనర్జీ ఓటమి
వెలువడిన నందిగ్రామ్ ఫలితం
బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి విజయం
1,736 ఓట్ల మెజారిటీతో గెలుపు
బెంగాల్ లో టీఎంసీ హవా
అధికారంలోకి రావాలనుకున్న బీజేపీకి ఎదురుదెబ్బ
సర్వత్రా ఉత్కంఠ కలిగించిన నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం ఫలితం వెల్లడైంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పెను సంచలనం నమోదు చేస్తూ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి సీఎం మమతా బెనర్జీని ఓడించారు. సువేందు అధికారి 1,736 ఓట్ల మెజారిటీతో సీఎం మమతా బెనర్జీపై విజయం సాధించారు. ఓవైపు రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ అద్భుత విజయాలు అందుకున్న తరుణంలో, పార్టీ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమిపాలవడం పార్టీ వర్గాలకు మింగుడుపడని విషయమే.
పశ్చిమ బెంగాల్ లో 292 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, నేడు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటివరకు అధికార టీఎంసీ 192 స్థానాల్లో నెగ్గింది. మరో 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 147 కాగా, ఆ మార్కును టీఎంసీ ఎప్పుడో దాటేసింది. ఇక, ఈ ఎన్నికల ద్వారా బెంగాల్ అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని కలలు గన్న బీజేపీకి ఆశాభంగం తప్పలేదు. బీజేపీ 61 స్థానాల్లో నెగ్గి, మరో 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.