సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ… ఏపీ ప్రభుత్వం ఆకస్మిక నిర్ణయం!
-సీఐడీలో అదనపు డీజీ హోదాలో సునీల్ కుమార్
-ఇటీవలే డీజీపీ హోదా కల్పించిన ప్రభుత్వం
-జీఏడీలో రిపోర్టు చేయాలంటూ తాజాగా ఆదేశాలు
ఇటీవలే డీజీపీ ర్యాంకు పొందిన ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని సునీల్ కుమార్ ను ఆదేశించింది. సునీల్ కుమార్ స్థానంలో సీఐడీ అదనపు డీజీగా అగ్నిమాపక శాఖ డీజీ సంజయ్ కి అదనపు బాధ్యతలు అప్పగించింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఐడీ పేరు, సునీల్ కుమార్ పేరు ఎక్కువగా వినిపించాయి. ఇటీవలే ఆయన సర్వీసు పరంగా ఉన్నత హోదా కూడా అందుకున్నారు. అంతలోనే ఆయనను బదిలీ చేయడం, అది కూడా సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశించడం పట్ల రాష్ట్ర వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
బదిలీలు సహజమే కానీ సునీల్ కుమార్ బదిలీ ఎందుకు జరిగిందనే ఆసక్తి నెలకొన్నది . సునీల్ కుమార్ అనేక కేసుల్లో తనదైన శైలిలో వ్యవహరించారు . దీంతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ముక్కు సూటి తనం ఉన్న వ్యక్తిగా ఆయనకు పేరుంది . ఆయన ప్రస్తుతం ఎలాంటి పోస్టు ఇవ్వలేదు . ఏ పోస్టు ఇస్తారు …ఆయన సేవలు ఏ విధంగా ప్రభుత్వం ఉపయోగించుకోనున్నది అనేది చర్చనీయాంశంగా మారింది.