ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు ప్రదర్శించిన సీఎం జగన్!
- గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష
- పనితీరు మెరుగుపర్చుకోవాలని ఎమ్మెల్యేలకు నిర్దేశం
- పనితీరు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని సంకేతాలు
సీఎం జగన్ ఇవాళ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేల పనితీరుపై చేపట్టిన సర్వేను ఈ సమీక్ష సమావేశంలో సీఎం జగన్ ప్రదర్శించారు. 30 మంది ఎమ్మెల్యేలు పనితీరులో వెనుకబడినట్టు సర్వే ద్వారా వెల్లడైనట్టు తెలుస్తోంది. పనితీరు మెరుగుపరుచుకోవాలని సదరు నేతలకు సీఎం జగన్ స్పష్టం చేశారు.
అదే సమయంలో, చాలా కాలంగా పనితీరు మెరుగుపర్చుకోని పలువురు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. గడప గడపకు కార్యక్రమంలో అతి తక్కువ రోజులు తిరిగిన ఎమ్మెల్యేల వివరాలను నేటి సమీక్ష సమావేశంలో సీఎం ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయించే అంశం పనితీరు ఆధారంగానే ఉంటుందని, పనితీరు మెరుగుపర్చుకోకపోతే టికెట్లు కష్టమేనన్న సంకేతాలు పంపించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని సీఎం జగన్ స్పష్టం చేశారు.
‘మా భవిష్యత్ నువ్వే జగన్’ పేరిట కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. మార్చి 18 నుంచి ప్రత్యేక కార్యాచరణకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. ఈ దిశగా పార్టీ కన్వీనర్లు, సచివాలయ సమన్వయకర్తలకు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. త్వరితగతిన ఏరియా గృహ సారథులు, కన్వీనర్ల నియామకం పూర్తి చేయాలని, వారికి శిక్షణ ఇవ్వాలని నిర్దేశించారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న జిల్లాల్లో కార్యక్రమం నిర్వహణపైనా సీఎం జగన్ ఇవాళ్టి సమీక్షలో చర్చించారు. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో కార్యక్రమం విస్తృతంగా చేపట్టాలని సూచించారు.