కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేనల్లుడి హఠాన్మరణం!
- గురువారం గుండెపోటుతో ఇంట్లో కుప్పకూలిన జీవన్ రెడ్డి
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
- హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన కిషన్ రెడ్డి
- శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్న కుటుంబ సభ్యులు
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ఇంట శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. మంత్రి మేనల్లుడు జీవన్ రెడ్డి గురువారం గుండెపోటుతో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలారు. హైదరాబాద్ లోని సైదాబాద్ విజయ్ నగర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్క లక్ష్మి, బావ నర్సింహారెడ్డి నివాసం ఉంటారు. వారి కుమారుడే జీవన్ రెడ్డి.. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
గురువారం సాయంత్రం జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారని, గుండె నొప్పితో కుప్పకూలారని సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను కంచన్ బాగ్ లోని డీఆర్డీఏ అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే జీవన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించిందని, ఆయనను కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నించినా ఫలితంలేకుండా పోయిందని వైద్యులు తెలిపారు. మేనల్లుడి మరణవార్త విని నోయిడాలో ఉన్న మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరినట్లు సమాచారం. కాగా, జీవన్ రెడ్డి అంత్యక్రియలను శనివారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.