సీనియర్ న్యాయవాది ప్రవర్తనపై సీజేఐ తీవ్ర ఆగ్రహం!
- సుప్రీంకు కేటాయించిన భూమిని న్యాయవాదుల కోసం ఉపయోగించాలని గతంలో పిటిషన్
- విచారణ జరపాలంటూ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజ్ఞప్తి
- తమ పిటిషన్ ను లిస్ట్ చేయకుంటే తీవ్రత పెంచాల్సి ఉంటుందని వ్యాఖ్య
- సహనం కోల్పోయిన సీజేఐ.. గొంతు ఎత్తొద్దంటూ ఆగ్రహం
- ప్రధాన న్యాయమూర్తితో ఇలాగేనా ప్రవర్తించేదని ప్రశ్న
ఓ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సహనం కోల్పోయారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ముందు కోర్టు నుంచి వెళ్లండి. మీరు మమ్మల్ని భయపెట్టలేరు’’ అంటూ తీవ్రంగా స్పందించారు.
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ఉన్నారు. సుప్రీంకోర్టుకు కేటాయించిన భూమిని లాయర్ల చాంబర్ నిర్మించేందుకు ఉపయోగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరపాలంటూ సీజేఐని వికాస్ సింగ్ కోరారు. కేసు విచారణ జరపాలని గత ఆరు నెలలుగా న్యాయవాదులు పోరాడుతున్నారని తెలిపారు.
దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్..‘‘మీరు భూమి ఇవ్వాలని ఇలా డిమాండ్ చేయలేరు. మేము రోజంతా ఖాళీగా కూర్చున్న రోజు మీరు మాకు చెప్పండి’’ అని వ్యాఖ్యానించారు. దీనికి వికాస్ సింగ్ బదులిస్తూ.. ‘‘మీరు రోజంతా ఖాళీగా కూర్చున్నారని నేను చెప్పడం లేదు. నేను కేసును లిస్ట్ చేయాలని మాత్రమే ప్రయత్నిస్తున్నాను. అది జరగకపోతే.. నేను తీవ్రత పెంచాల్సి ఉంటుంది. దాన్ని మీ నివాసం దాకా తీసుకురావాల్సి ఉంటుంది. బార్ అసోసియేషన్ అంతదూరం వెళ్లాలని నేను కోరుకోవడం లేదు’’ అని హెచ్చరించినట్లుగా మాట్లాడారు.
దీంతో సహనం కోల్పోయిన సీజేఐ.. ‘‘ప్రధాన న్యాయమూర్తిని బెదిరించాలని చూడొద్దు. ఇలాగేనా ప్రవర్తించేది? నేను ప్రధాన న్యాయమూర్తిని. 2000 మార్చి 29 నుంచి 22 ఏళ్లుగా ఇక్కడ ఉన్నాను. బార్‌లోని ఒక సభ్యుడు, వ్యాజ్యదారుడు లేదా మరెవరికీ, ఎన్నడూ.. నన్ను బెదిరించే చాన్స్ ఇవ్వలేదు. నా కెరీర్‌లో చివరి రెండేళ్లలో కూడా ఆ అవకాశం ఇవ్వను’’ అని చెప్పారు. ‘‘మిమ్మల్ని సాధారణ కక్షిదారుగానే పరిగణిస్తాం. మీకు ఇష్టం లేని పని నేను చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు’’ అని హెచ్చరించారు. అసలు కోర్టులో గొంతు ఎత్తొద్దని స్పష్టంచేశారు.
దీనికి స్పందించిన వికాస్ సింగ్.. ‘‘20 ఏళ్లుగా న్యాయవాదులు చాంబర్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయం గురించి నేను గట్టిగా చెప్పాలని భావించాను. బార్ అసోసియేషన్ ఏమీ చేయనందున.. నిజంగానే ఏమీ చేయలేదని అనుకోకండి’’ అని అన్నారు. ‘‘దయచేసి మీ గొంతు ఎత్తకండి. సుప్రీం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రవర్తించే పద్ధతి ఇది కాదు. మీరు సుప్రీంకోర్టుకు కేటాయించిన భూమిని బార్‌కు ఇవ్వాలని అడుగుతున్నారు. నేను నా నిర్ణయం తీసుకున్నాను. దీనిపై 17వ తేదీన విచారణ జరుపుతాం’’ అని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఈ వ్యవహారం తర్వాత సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, ఎన్ కే కౌల్ తదితరులు.. బార్ అసోసియేషన్ తరఫున ప్రధాన న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పినట్లు సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి.