తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద నిరసన … అడ్డుకున్న పోలీసులు
-ప్రతిపక్షాల నిరసనలతో రుయా వద్ద ఉద్రిక్త వాతావరణం
-తిరుపతి ఘటనపై నిరసనల హోరు
-అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
-నగరిలో సీపీఐ నారాయణ గృహ నిర్బంధం
-బాధిత బంధువులను ఆసుపత్రి నుంచి పంపించివేసిన పోలీసులు
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కొవిడ్ రోగులు మృత్యువాత పడిన ఘటనపై నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బాధిత బంధువులను కూడా ఆసుపత్రి నుంచి పంపించివేశారు. సీపీఐ చేపట్టిన ధర్నాలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొనబోతున్నారన్న సమాచారంతో నగరి వద్ద అడ్డుకున్న పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. అలాగే, ఆ పార్టీ నేతలు కొందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ప్రతిపక్షాల ఆందోళనలతో రుయా ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది . పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అక్కడకు చేరుకొని నిరసన కారులను అదుపులోకి తీసుకున్నాయి.సిపిఐ,టీడీపీ ,బీజేపీ పార్టీలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి.అయితే బీజేపీ నాయకులూ మాత్రం తాము నిరసనలో పాల్గొనలేదని తమకు తెలిసిన వారిని పరామర్శించేందుకు వచ్చామని అంటున్నారు.
తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, పలువురు టీడీపీ నేతలు రుయా ఆసుపత్రి వద్దకు వచ్చి ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శించారు. మృతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వాలని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని బలవంతంగా లాక్కెళ్లి వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బీజేపీ ప్రతినిధి పీఎస్ రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి తదితరులు ఆసుపత్రికి రాగా వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అలాగే, మునిసిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన సీపీఎం నాయకులను కూడా పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు.