Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

యాసంగి సీజన్ లో సాగునీటి సరఫరాపై మంత్రి పువ్వాడ సమీక్ష…

యాసంగి  సీజన్ లో సాగునీటి సరఫరాపై మంత్రి పువ్వాడ సమీక్ష
అధికారుల మధ్య సమన్వయ లోపాన్ని ఎత్తిచూపిన కమల్ రాజ్
యూనిట్ అధికారిగా సిఇ కి బాధ్యత వహించాలన్న కలెక్టర్ గౌతమ్
పంటకు నీరు రాకపోతే రైతులు నష్టపోతారన్న తాతా మధు
నీటి పంపిణి సక్రమంగా జరగాలిఎమ్మెల్యేవెంకట వీరయ్య

నీటిపారుదల శాఖ అధికారులు చిట్ట చివరి ఆయకట్టుకు సాగు నీరు అందేలా పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులతో యాసంగి (రబీ) సీజన్ లో సాగునీటి సరఫరాపై జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుండి పాలేరు రిజర్వాయర్ లోకి ఇప్పటికి 19 టీఎంసీ నీరు వచ్చినట్లు తెలిపారు. గత యాసంగిలో 1.72 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, అది ప్రస్తుతం 2.25 లక్షల పైచిలుకుకు పెరిగింది. ప్రస్తుత యాసంగికి సాగునీటి సరఫరాకి ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ చేయాలన్నారు. నాగార్జున సాగర్ లో తగినంత నీరు ఉందని, అవసరం మేరకు నీటి సరఫరా ఉంటుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. హెడ్ ఎండ్ లో ఉన్న రైతులు, చివరి ఆయకట్టు రైతుకు నీరు చేరేలా సహకారం అందించాలన్నారు. నీటిపారుదల అధికారులకు విషయమై సహకరించాలని, దిశగా రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్ శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, వారి వారి పరిధిలో క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ, చురుకుగా ఉండాలని, సమస్య ఎదురైనా పరిష్కరించే విధంగా సిద్ధంగా ఉండాలన్నారు. ప్రస్తుత యాసంగికి అవసరమైన తడి సరిగ్గా జరగట్లేదని, రైతుల నుండి ఆందోళనలు వస్తున్నట్లు తెలిపారు. సిఇ క్షేత్ర పరిధిలో చివరి ఆయకట్టు వరకు పర్యటించి, సమస్యలు అవగతం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన అన్నారు. పాలేరుకు వచ్చిన నీరు దామాషా ప్రకారం సత్తుపల్లి చివరి ఆయకట్టుకు అందేలా చూడాలన్నారు. చివరి ఆయకట్టుకు నీరందించే బాధ్యతను ఇఇ వెంకటేశ్వర రావు కు అప్పగించినట్లు మంత్రి తెలిపారు.

సమావేశంలో జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్ మాట్లాడుతూ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల నీరు సమృద్ధిగా ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మొత్తం ఆయకట్టును కాపాడాలన్నారు. రైతులు ప్రభుత్వం మీద నమ్మకంతో పంటలు వేశారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. పంపిణీ లోపాన్ని సరిదిద్దే చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.

యూనిట్ అధికారిగా సిఇ కి బాధ్యత: కలెక్టర్

సమావేశంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ యూనిట్ అధికారిగా సిఇ కి బాధ్యత ఉందన్నారు. సిఇ జిల్లాను సమన్వయం చేయాలన్నారు. ఇంజనీర్లు కాల్వల వెంబడి పర్యటించి, తనిఖీలు చేస్తూ, రైతులు ఆందోళన చేస్తే, విషయాన్ని అవగాహన చేయాలని, నీరు ఎప్పుడు వస్తుంది, జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయాలని, ఎఇ, డిఇ స్థాయినుండే బాధ్యతగా ఉండాలని ఆయన తెలిపారు. ఎక్కువ రోజులు ఆయకట్టును తడిపితే అయ్యే నష్టం గురించి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని, రైతులను సంప్రదించి, ఎక్కడ సమస్య ఉంటే అక్కడే పరిష్కరించాలని అన్నారు. లష్కర్ల కొరత ఉన్నందున, విఆర్ఏ లను విధులందు ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. చివరి ఆయకట్టు రైతులకు నష్టం కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు.

పంటకు నీరు రాకపోతే నష్టపోతారు: తాతా మధు 

సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ నీటిపారుదల శాఖలో పెద్ద సంఖ్యలో సిబ్బంది ఉన్నట్లు, శాఖలో సమన్వయ లోపం తలెత్తకుండా చూడాలన్నారు. పాలేరు రిజర్వాయర్ నుండి చివరి ఆయకట్టుకు నీరు అందే క్రమంలో తరుగును ముందే తీసి, మిగతా నీటిని పంపిణీ చేయాలన్నారు. రైతులు ఎంతో వ్యయ ప్రయాసాలకోర్చి సాగు చేస్తారని, పంటకు నీరు రాకపోతే నష్టపోతారని, సైన్టిఫిక్ గా నీటిని కేటాయించాలని ఆయన తెలిపారు.

నీటిపంపిణీ సక్రమంగా జరగాలి : సండ్ర

సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ నీటి కేటాయింపుల్లో నాగార్జున సాగర్ ఒప్పంద రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. నాగార్జున సాగర్ నుండి వచ్చిన నీటిలో పై ప్రాంతాలకు ఎన్ని టీఎంసీ లు, చివరి ఆయకట్టు ప్రాంతాలకు ఎన్ని టీఎంసీలు వాడారో తెలుపాలన్నారు. రెండవ పంట కొరకు కేవలం 8 టీఎంసీల నీరు మాత్రమే చివరి ఆయకట్టుకు ఇచ్చినట్లు తెలిపారు. వారాబంది దామాషా ప్రకారం చేపట్టడం లేదని ఆయన అన్నారు. నాగార్జున సాగర్ లో 519 అడుగుల నీరు ఉన్నప్పుడే నీటికి ఇబ్బందులు రాలేదని, ఇప్పుడు 557 అడుగులు ఉండగా సాగునీటికి ఇబ్బందులు ఎందుకని అన్నారు. సాగునీటి అధికారుల వైఫల్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన తెలిపారు. వారాబంది అన్ని ప్రాంతాలకు దామాషా ప్రకారం పంచాలన్నారు.

సమావేశంలో డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర రావు, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శంకర్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, ట్రాన్స్కో ఎస్ఇ సురేందర్, మిషన్ భగీరథ ఇఇ పుష్పలత, నీటిపారుదల, విద్యుత్ శాఖల ఇంజనీర్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఇది ముమ్మాటికీ దుశ్చర్యే …చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తూ రక్తపాతం సృష్టిస్తున్నారు …జగన్

Ram Narayana

హైదరాబాద్ ‘జూ’ లో నిజాం కాలంనాటి ఆడ ఏనుగు కన్నుమూత!

Drukpadam

కేరళలో బెంబేలెత్తిస్తున్న టమాటా ఫ్లూ.. లక్షణాలు ఇవే!

Drukpadam

Leave a Comment