నాటు…నాటు తెలుగు పాటకు సినీప్రపంచం ఫీదా….వరించిన ఆస్కార్ !
-చరిత్ర సృష్టించిన తెలుగు సినిమా..
-బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ‘నాటునాటు’కు అవార్డు ప్రకటన
-ప్రకటన రాగానే హోరెత్తిపోయిన ఆస్కార్ థియేటర్
-ఆనందోత్సాహాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ
-ప్రశంసల వెల్లువ …ప్రధాని ,రాష్ట్రపతి ,తెలుగు రాష్ట్రాల సీఎం లు కేసీఆర్ ,జగన్ ,
-సినీనటులు చిరంజీవి ,చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , రాంగోపాల్ వర్మ
-ప్రపంచ వ్యాపితంగా తెలుగోడు గొప్పతనాన్ని చాటిన ఆర్ ఆర్ ఆర్
ఆర్ ఆర్ ఆర్ తెలుగు మూవీ లో నాటు …నాటు పాటకు సినీ ప్రపంచం ఫీదా అయింది …. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు కు ఎంపిక అయింది . దీంతో దేశం యావత్తు ఆస్కార్ వైపు చూసింది. ఆస్కార్ అవార్డు లు ప్రకటిస్తున్న వేళ నామినలంతా ఉత్కంఠభరితంగా హాల్లోఉన్నారు . ప్రకటన రానే వచ్చింది . ఆర్ ఆర్ ఆర్ మూవీ లో నాటు …నాటు పాటకు ఆస్కార్ ప్రకటిస్తున్నట్లు చెప్పడంతో మూవీ టీం అంతా సంబరాల్లో మునిగిపోయారు .ఇది దేశానికే గర్వకారణమని పలువురు ప్రముఖులు వారిని ప్రశంసలతో ముంచెత్తారు . రాష్ట్రపతి ప్రధాని ,తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు , సినీ ప్రముఖులు , వివిధ రంగాలకు చెందిన వారు వారిని అభినందించారు .
తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. ఈ పాటకు మొదటి నుంచి గట్టి పోటీ నిచ్చిన టెల్ ఇట్ లైక్ ఎ విమెన్ సినిమాలోని ‘అప్లాజ్’, బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్ సినిమాలోని ‘లిఫ్ట్ మి అప్’, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాలోని ‘దిస్ ఈజ్ లైఫ్’, టాప్ గన్ మావెరిక్ సినిమాలోని ‘హోల్డ్ మై హ్యాండ్’ పాటలను వెనక్కి నెట్టి మరీ ‘నాటునాటు’ పాట ఆస్కార్ దక్కించుకుంది.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటునాటు’కు అవార్డు ప్రకటించగానే థియేటర్ దద్దరిల్లిపోయింది. మరోవైపు, లైవ్‌లో చూస్తున్న తెలుగు సినీ అభిమానులు ఆనందంతో పులకరించిపోయారు. ఆస్కార్ అవార్డు అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ బృందం ఆనంద డోలికల్లో తేలియాడుతోంది.
నాటునాటు పాటను చంద్రబోస్ రాయగా రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. ట్రిపుల్ ఆర్ సినిమా 24 మార్చి 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. ఈ పాటకు వారు చేసిన డ్యాన్స్‌కు ప్రపంచం మొత్తం ఫిదా అయింది.
తెలుగు సినిమా పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం, అవార్డు దక్కించుకోవడం ఇదే తొలిసారి. దీంతో తెలుగోడు గర్వంతో తలెత్తుకుంటున్నాడు. టాలీవుడ్‌లో అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. దర్శక దిగ్గజం రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఇతర చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
ఆస్కార్ వేదికపై ఎగిరిన తెలుగు జెండా.. అవార్డు అందుకున్న కీరవాణి, చంద్రబోస్.. !
- నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు
- అవార్డు ప్రకటనతో దద్దరిల్లిన థియేటర్
- సగర్వంగా అవార్డు అందుకున్న కీరవాణి, చంద్రబోస్
సినీ ప్రపంచంలో తెలుగు జెండా సగర్వంగా రెపరెపలాడింది. తెలుగు సినిమా కీర్తి దిగంతాలకు ఎదిగింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాట బెస్ట్ సాంగ్ అవార్డును సాధించింది. ఈ పాటను సృష్టించిన సంగీత దర్శకుడు కీరవాణి, పాట రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఈ పాటకు ఆస్కార్ అవార్డును ప్రకటించగానే థియేటర్ దద్దరిల్లింది. లైవ్ లో చూస్తున్న కోట్లాది మంది అభిమానులు ఆనందంతో పులకించిపోయారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు.
ఇదొక ఎమోషనల్ మూమెంట్: జూనియర్ ఎన్టీఆర్
‘నాటునాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఆ చిత్ర యూనిట్ ఆనందం ఆకాశాన్నంటుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దీనిపై స్పందిస్తూ… ఆస్కార్ రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. నాటునాటు పాటకు అవార్డు రావడం ఎమోషనల్ మూమెంట్ అని అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇండియాకు ప్రాతినిథ్యం వహించిందని చెప్పారు. ‘కంగ్రాచ్యులేషన్స్ కీరవాణి సర్ జీ, జక్కన్న (రాజమౌళి), చంద్రబోస్ గారు’ అని ట్వీట్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టీమ్ కు అభినందనలు
ఆస్కార్ వేడుకల్లో భుజంపై పులి బొమ్మ గురించి ఎన్టీఆర్ చెప్పిన మాటలకు అంతా ఫిదా!
ఆస్కార్ వేడుకల్లో తెలుగు చిత్ర పరిశ్రమ తళుక్కున మెరిసింది. ఊహించినట్టే ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. లాస్ ఏంజెల్స్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం హాజరైంది. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్ అందరూ ప్రత్యేకంగా డిజైన్ చేసిన సంప్రదాయ దుస్తులు ధరించి రెడ్ కార్పెట్ పై నడిచారు. చరణ్, ఎన్టీఆర్ బ్లాక్ కలర్ షెర్వానీ సూట్ లో మెరిపోయారు.
ఇక ఎన్టీఆర్ సూట్ పై గర్జిస్తున్న పులిబొమ్మ అందరినీ ఆకట్టుకుంది. భుజంపై ఉన్న ఆ పులి బొమ్మ గురించి ఆస్కార్ నిర్వాహకులు ఆరా తీశారు. ఈ పులి బొమ్మ ఏమిటని ఓ యాంకర్ అడగ్గా ఎన్టీఆర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్‌లో చూశారు కదా. నాతో పాటు పులి కనిపించింది. నిజానికి, పులి మా దేశ జాతీయ జంతువు. మా దేశ చిహ్నంతో రెడ్ కార్పెట్‌పై నడవడం గర్వంగా ఉంది’ అని చెప్పారు. ఎన్టీఆర్ సమాధానానికి ఫిదా అయిన యాంకర్ మిమ్మల్ని చూస్తే దక్షిణ ఆసియా మొత్తం గర్వపడుతుందని తెలిపారు.
వీరిద్దరూ భారత సినీ పరిశ్రమలో అత్యంత విలువైన రత్నాలు: రామ్ చరణ్
‘ఆర్ఆర్ఆర్’ చిత్రం భారతీయ సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచం నలుదిశలా చాటింది. ‘నాటునాటు’ పాట ఆస్కార్ అవార్డును సాధించడంతో ఈ సినిమా పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ స్పందిస్తూ… ఇప్పటికీ తనకు కలలో ఉన్నట్టుగానే ఉందని చెప్పారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సినిమా ఎప్పటికీ నిలిచి పోతుందని అన్నారు. తమ జీవితాల్లో ఈ సినిమా చాలా ప్రత్యేకమైనదని చెప్పారు. రాజమౌళి, కీరవాణి ఇద్దరూ భారతీయ సినీ పరిశ్రమలో రెండు అత్యంత విలువైన రత్నాలని కొనియాడారు. మాస్టర్ పీస్ లాంటి ఈ చిత్రంలో తనకు అవకాశం ఇచ్చినందుకు వీరిద్దరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నాటునాటుకు సంబంధించిన ఎమోషన్ ఉందని రామ్ చరణ్ అన్నారు. చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ అందరూ కలిసి ఈ ఎమోషన్ ను క్రియేట్ చేశారని కితాబిచ్చారు. సోదరుడు తారక్ తో కలిసి మళ్లీ డ్యాన్స్ చేయాలని, మళ్లీ రికార్డులు సృష్టించాలని కోరుకుంటున్నానని చెప్పారు. తన కోస్టార్ అలియా భట్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ ఆస్కార్ అవార్డు ప్రతి ఇండియన్ యాక్టర్ కు, టెక్నీషియన్ కు, సినీ అభిమానికి చెందుతుందని చెప్పారు. ‘మనం గెలిచాం. ఒక భారతీయ చిత్ర పరిశ్రమగా మనం గెలిచాం. ఒక దేశంగా మనం గెలిచాం. మన ఇంటికి ఆస్కార్ వస్తోంది’ అని ట్వీట్ చేశారు.
పదంలోనే సంగీతం ఉందంటూ.. ఆస్కార్ వేదికపై తెలుగు గొప్పతనాన్ని వివరించిన చంద్రబోస్
తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్త ఖ్యాతి తెచ్చిపెట్టిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఇప్పుడు ఆస్కార్ అవార్డు కూడా అందుకుంది. ఈ సినిమాలోని నాటునాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పురస్కారం దక్కింది. లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో అంగరంగ వైభంగా జరిగిన వేడుకలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్నారు. అనంతరం ఆస్కార్ బ్యాక్ స్టేజ్ పై ఈ పాట, సినిమా గురించి అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబోస్ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో 56 అక్షరాలున్న భాషతో ఈ పాటను ఎలా రాశారు? ఈ క్రమంలో మీకు ఎదురైన సవాళ్లు ఏంటి? అన్న ప్రశ్నకు బదులుగా తెలుగు గొప్పదనం గురించి చంద్రబోస్ అద్భుతంగా వివరించారు. తెలుగు పదాల్లోనే సంగీతం ఇమిడి ఉందన్నారు.
‘తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. ఎన్నో పదాలు, వ్యక్తీకరణలు, మరెన్నో భావాలతో కూడిన గొప్ప సాహిత్య, సంగీత భాష మా తెలుగు. అందుకే తెలుగులో సాధారణ పదం రాసినా అది సంగీతంలా ప్రతిధ్వనిస్తుంది. ఆర్ఆర్ ఆర్ లోని నాటు నాటు పాటను తెలుగు తెలిసిన అభిమానులు ప్రేమించారు. మా భాష తెలియని మీలాంటి పాశ్చాత్య ప్రేక్షకులు కూడా ఇంతగా ప్రేమిస్తున్నారంటే కారణం పాటలో ఉన్న శబ్దం, సంగీతమే. అదే మాకు ఈ అవార్డు తెచ్చిపెట్టింది. ఈ పాటలో నేను రాసిన లైన్లు అన్నీ మా గ్రామంలో నాకు ఎదురైన అనుభవాలే. ఇప్పుడు నేను ఇండియా వెళ్లి ఈ అవార్డును నా భార్య, పిల్లలకు చూపించాలని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు.
ఆస్కార్ అవార్డు అందుకుని వేదికపై ఇంగ్లీష్ పాట పాడిన కీరవాణి..
130 కోట్ల మంది భారతీయుల కలను ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సాకారం చేసింది. ఈ చిత్రంలోని ‘నాటునాటు’ పాట ఆస్కార్ అవార్డును సాధించింది. ఆస్కార్ అవార్డును సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ అందుకున్నారు. ఆస్కార్ అందుకున్న అనంతరం వేదికపై కీరవాణి మాట్లాడుతూ.. పాట రూపంలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
‘నాకు ఆస్కార్ ఇచ్చిన అకాడెమీకి ధన్యవాదాలు. ఈరోజు నా చేతిలో ఆస్కార్ ఉంది. నా మదిలో ఒక కోరిక ఉండేది. రాజమౌళి, నా కుటుంబం కోరుకున్న మాదిరే… ఆర్ఆర్ఆర్ గెలవాలి, ప్రతి భారతీయుడు గర్వపడాలి. నన్ను ఈ ప్రపంచంలో ఎత్తైన స్థానంలో ఉంచాలి. దీని కోసం కృషి చేసిన కార్తికేయకు థ్యాంక్స్’ అని కీరవాణి పాట రూపంలో చెప్పారు.
ఆస్కార్ అవార్డులతో దేశం ఉప్పొంగింది.. గర్విస్తోంది: ప్రధాని మోదీ
ఆర్ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రాలు ఆస్కార్ అవార్డులు గెలవడంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మక అవార్డులతో దేశం ఉప్పొంగిపోయిందని, గర్విస్తోందని అన్నారు. ఆర్ఆర్ఆర్, విస్పరర్స్ చిత్ర బృందాలను ప్రధాని అభినందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వేర్వేరుగా అభినందన సందేశాలు పోస్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ‘అద్భుతం. నాటు నాటు ప్రజాదరణ విశ్వ వ్యాప్తం. ఇది ఎన్నో ఏళ్లు గుర్తుండిపోయే పాట అవుతుంది. ఇంత ప్రతిష్ఠాత్మక గౌరవం అందుకున్న ఎంఎం కీరవాణి, చంద్రబోస్, మొత్తం చిత్ర బృందానికి నా అభినందనలు. భారతదేశం ఉప్పొంగింది, గర్విస్తోంది’ అని ట్వీట్ చేశారు.
మరో ట్వీట్‌లో విస్పరర్స్ బృందాన్ని కొనియాడారు. ‘కార్తికి, గునీత్ మోంగా, ది ఎలిఫెంట్ విస్పరర్స్ బృందం మొత్తానికి నా అభినందనలు. ఈ చిత్రంతో సుస్థిర అభివృద్ధి, ప్రకృతితో సామరస్యంగా జీవించాల్సిన ప్రాముఖ్యతను అద్భుతంగా హైలైట్ చేశారు’ అని ట్వీట్ చేశారు.
ఆస్కార్ రావడంపై వెంకయ్యనాయుడు, కేసీఆర్, జగన్, చంద్రబాబు స్పందనసినీ ప్రపంచంలో తెలుగుజెండా రెపరెపలాడుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డును ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటునాటు’ పాట కైవసం చేసుకుని తెలుగోడి సత్తా నలుదిశలా చాటింది. ‘ఆర్ఆర్ఆర్’ సాధించిన ఈ ఘన విజయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలియజేశారు.
రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, దర్శకుడు రాజమౌళి, నటులు ఎన్టీఆర్, రాంచరణ్ ల ప్రతిభ ద్వారా తెలుగు పాటకు ప్రపంచ వేదిక గౌరవాన్ని ఇవ్వడం ఆనందదాయకమని వెంకయ్యనాయుడు అన్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు గీతం ఆస్కార్ అందుకోవడం అభినందనీయమని ప్రశంసించారు. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.
‘నాటునాటు’కు ఆస్కార్ రావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటిందని కొనియాడారు. మన పాటకు ఆస్కార్ రావడం తెలుగు వారికి గర్వకారణమని చెప్పారు. తెలంగాణ సంస్కృతికి ఈ పాట అద్దం పట్టిందని అన్నారు. ఈ పాట తెలుగు ప్రజల అభిరుచికి నిదర్శనమని చెప్పారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… తెలుగుజెండా ఎగురుతోందని అన్నారు. మన తెలుగు పాటకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించడం పట్ల ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణిలు ఈ ఘన విజయానికి అర్హులని అన్నారు. వీరితో పాటు పాట రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, ఇతర టీమ్ సభ్యులకు అభినందనలు తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ… బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ ను కైవసం చేసుకోవడం ద్వారా ‘నాటునాటు’ పాట చరిత్రలో నిలిచిపోయిందని అన్నారు. భారతీయ సినీ పరిశ్రమకు ఇదొక గొప్ప సందర్భమని… ముఖ్యంగా తెలుగు పరిశ్రమకు మరింత ప్రత్యేకమైనదని చెప్పారు. రాజమౌళి, కీరవాణి, తారక్, చరణ్, చంద్రబోస్, రాహుల్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ లకు అభినందనలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు.