సావర్కర్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి ఉద్ధవ్ థాకరే వార్నింగ్!
- నేను సావర్కర్ ని కాదు.. గాంధీని అన్న రాహుల్
- సావర్కర్ తమకు దేవుడు అన్న థాకరే
- సావర్కర్ గురించి తప్పుగా మాట్లాడితే సహించబోమని హెచ్చరిక
సావర్కర్ ను కించపరిచేలా మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే హెచ్చరించారు. హిందుత్వ సిద్ధాంతాల విషయంలో సావర్కర్ తమకు స్ఫూర్తి అని చెప్పారు. ఆయనను కించపరిచేలా మాట్లాడకుండా ఉండాలని అన్నారు. సావర్కర్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే విపక్ష కూటమిలో చీలికలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు.
అండమాన్ జైల్లో 14 ఏళ్ల పాటు సావర్కర్ ఎంతో టార్చర్ అనుభవించారని థాకరే అన్నారు. మనం కేవలం ఆయన పడిన బాధల గురించే చదువుతామని… అది దేశం కోసం చేసిన త్యాగమని చెప్పారు. సావర్కర్ తమకు దేవుడితో సమానమని… అలాంటి వ్యక్తి గురించి తప్పుడుగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. తమ వర్గం, కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రజస్వామ్యాన్ని కాపాడే విషయంలో కలిసి పోరాడాల్సి ఉందని చెప్పారు. ఇలాంటి విషయాల గురించి టైమ్ వేస్ట్ చేసుకోకూడదని అన్నారు.
‘నా పేరు సావర్కర్ కాదు. నా పేరు గాంధీ. గాంధీలు ఎవరినీ క్షమాపణలు కోరరు’ అని గత శనివారం రాహుల్ అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే రాహుల్ పై థాకరే విమర్శలు గుప్పించారు.