నా అరికాళ్లపై పోలీసులు కుళ్ళ పొడిచారు : ఎంపీ రఘురాం కృష్ణం రాజు
న్యాయమూర్తికి లిఖిత పూర్వక ఫిర్యాదు స్పందించిన కోర్ట్
-గుంటూరు రమేష్ హాస్పటల్ కు తరలించాలని ఆదేశం
-రఘురామను సీఐడీ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
-నాలుగు పేజీల ఫిర్యాదు సమర్పించిన రఘురామ
-గతరాత్రి పోలీసులు తనను వేధించారన్న ఎంపీ
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఐడీ పోలీసులపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తన కాళ్లకు గాయాలయ్యాయని, పోలీసులు తనను కొట్టడం వల్లే గాయపడ్డానని రఘురామకృష్ణరాజు సీఐడీ కోర్టు న్యాయమూర్తికి తెలియజేశారు. గత రాత్రి తనను వేధింపులకు గురిచేశారని, అరికాళ్లు వాచిపోయేలా కొట్టారని వివరించారు. ఈ మేరకు నాలుగు పేజీల లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఏపీ సీఐడీ అధికారులు ఈ సాయంత్రం రఘురామకృష్ణరాజును సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీఐడీ అధికారులు రిమాండ్ నివేదికను న్యాయమూర్తికి సమర్పించారు. అటు, రఘురామకృష్ణరాజు తనకు బెయిల్ మంజూరు చేయాలని ఓ పిటిషన్, అత్యవసర వైద్యసాయం కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రఘురామకు తగిలిన గాయాలను చూసి రిమాండ్ నివేదికను పెండింగ్ లో ఉంచిన న్యాయస్థానం… ఆయనను ఆసుపత్రికి తరలించాలని ఆదేశింది. అయితే, తాను ప్రభుత్వాసుపత్రికి వెళ్లనని రఘురామ విముఖత వ్యక్తం చేయడంతో, రమేశ్ ఆసుపత్రికి తరలించాలని న్యాయమూర్తి సూచించారు.
కాగా, తనను పోలీసులు కొట్టడంతో గాయపడ్డానని రఘురామ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, ఆయనకు తగిలిన గాయాల వివరాలను కోర్టు నమోదు చేసుకుంది. రఘురామ తరఫు న్యాయవాదులు కోర్టుకు అందుకు తగిన ఆధారాలను సమర్పించారు. ఈ కేసును సీబీఐ లేదా ఎన్ఐఏకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, ఈ వ్యవహారాన్ని లోక్ సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా దృష్టికి తీసుకెళ్లేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో ఏం జరుగుతోంది?: ఏపీ హైకోర్టు
వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామ కృషంరాజు అరెస్ట్ విషయంలో హైడ్రామా చోటుచేసుకున్న విషయం తెలిసిందే . ఆయన్ను అరెస్ట్ చేసిన సి ఐ డి పోలీసులు గుంటూరు లోని కార్యాలయానికి తరలించారు. తొలుత హైకోర్ట్ లో బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేశారు.దాన్ని తిరస్కరించటం తో ఎ సి బి కోర్ట్ ను ఆశ్రయించారు.అక్కడ కూడా బెయిల్ పై వాదనల సందర్భంగా తనను పోలీసులు కొట్టారని రఘురామ కృషంరాజు న్యాయమూర్తి కి తనను పోలీసులు కొట్టారని లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్ దురుసు ప్రవర్తనపై హైకోర్ట్ లో ఫిర్యదు చేశారు.దీంతో హై కోర్ట్ సీరియస్ గా స్పందించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్నా పరిణామాల గురించి తీవ్రంగా పరిగణించింది. ఎంపీ రఘు రామకృష్ణ రాజు కేసు విచారణకు హైకోర్టులో జస్టిస్ ప్రవీణ్ నేతృత్వంలో స్పెషల్ డివిజన్ బెంచ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసింది. రఘురామ తరఫున హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు .రఘురామకు తగిలినవి తాజా గాయాలని తేలితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందని హైకోర్టు ప్రశ్నించింది. కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా కొడతారు అని కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది .