జూనియర్ ఎన్టీఆర్ తో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ భేటీ!
- రూ.4 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణం
- ఖమ్మం పట్టణంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు
- ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి
- విగ్రహాన్ని ఆవిష్కరించనున్న జూనియర్ ఎన్టీఆర్
- విగ్రహావిష్కరణ కార్యక్రమంపై జూనియర్ ఎన్టీఆర్ తో చర్చించిన పువ్వాడ
తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల శోభ నెలకొంది. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడిగా ఖ్యాతి గాంచిన ఎన్టీఆర్ పేరిట ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద 45 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. టాలీవుడ్ అగ్రహీరో, ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఈ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో, తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. ఈ నెల 28న విగ్రహావిష్కరణ జరపనుండగా, దానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ… జూనియర్ ఎన్టీఆర్ తో చర్చించారు. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ కూడా అక్కడే ఉన్నారు.
ఖమ్మంలో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గతేడాదే నిర్ణయించారు. శ్రీకృష్ణుడి రూపంలోని ఈ ఎన్టీఆర్ విగ్రహం నిర్మాణానికి రూ.4 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మంత్రి పువ్వాడ, తానా మాజీ ప్రెసిడెంట్ తాళ్లూరి జయశేఖర్, ఖమ్మం ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, తానా సభ్యులు, ప్రవాసాంధ్రులు, కొందరు ఇండస్ట్రియలిస్టులు ఈ విగ్రహ నిర్మాణంలో ఆర్థికంగా పాలుపంచుకుంటున్నారు.
ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి కావడంతో, ఆ రోజున ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మంత్రి పువ్వాడ, సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, తానా మాజీ ప్రెసిడెంట్ తాళ్లూరి జయశేఖర్, రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.
ప్రస్తుతం ఈ విగ్రహానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు ద్వారా ఖమ్మం పట్టణం పర్యాటకంగానూ ఆకర్షణీయంగా మారుతుందని భావిస్తున్నారు.