ప్రతి పోడు రైతుకు పట్టా మంజూరు చేయాలి… మాజీ ఎంపీ పొంగులేటి!
– ఎన్నికల సమయంలోనే గిరిజనులు గుర్తుకొస్తారా…??
– పోడు రైతుల ఉసురు కేసీఆర్ ను వెంటాడుతుంది
– కొత్తగూడెంలో పోడు రైతు భరోసా ర్యాలీ
– కలెక్టర్ లేకపోవడంతో ఛాంబర్ తలుపుకు పరిస్థితి వివరించి నిరసన
కొత్తగూడెం : ప్రతి పోడు రైతుకు పట్టా మంజూరు చేయాలని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఇల్లందు క్రాస్ రోడ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన పోడు రైతు భరోసా ర్యాలీ విజయవంతం అయింది. ఈ కార్యక్రమానికి వందలాది మంది పోడు రైతులు, నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును విమర్శించారు. గిరిజనులు, ఆదివాసీలు, గిరిజనేతరులు తరతరాల నుండి సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు మంజూరు చేయడంలో మీన మేషాలు లెక్కించడం తగదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాల కాలం గడిచిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజనులకు గిరిజనేతరులకు పొడు పట్టాలు జారీ చేస్తామని మాయ మాటలు చెప్పి ఇంతవరకు ఏ ఒక్క పోడు రైతుకు పట్టాలు జారీ చేయలేదని, ఎన్నికల సమయంలో గిరిజనులు, పోడు రైతులు గుర్తుకొస్తారని ఎన్నికల అనంతరం ఏ ఒక్కరిని పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు.
– కుర్చీ వేసుకుని కూర్చొని పట్టాలిస్తా చెప్పిన హామీ ఏమైంది…..?
2018 ఎన్నికల సమయంలో ప్రతి పోడు రైతుకు నేనే స్వయంగా కుర్చీ వేసుకుని కూర్చొని పట్టాలిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నాలుగున్నర సంవత్సరాలు గడిచినా మాట నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. వేలాది మంది గిరిజన కుటుంబాల ఉసురుపోసుకున్నారని, పోడు రైతుల కుటుంబాలను రోడ్డుపాలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. సుమారు నాలుగు లక్షల 14 వేల కుటుంబాలు 13 లక్షల ఎకరాల పోడు పట్టాల కొరకు దరఖాస్తులు చేసుకోగా డిసెంబర్ నెలలో 11 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వనున్నామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు కేవలం నాలుగు లక్షల ఎకరాలకు మాత్రమే పోడు పట్టాలు ఇవ్వడం సాధ్యమవుతుందని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. పోడు పట్టా కొరకు దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మరణించిన ప్రతి పోడు రైతు కుటుంబానికి 20 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పోడు సాగు చేసుకుంటున్న గిరిజనుల మీద అక్రమ కేసులు బనాయించారని అవి తక్షణమే తొలగించాలని అన్నారు. అర్హులైన ప్రతి పోడు రైతుకు పట్టాలు మంజూరు చేయాలని లేదంటే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. భారీ ర్యాలీ అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన సమయంలో కలెక్టర్ ఛాంబర్ కు తాళం వేసి ఉండటంతో ఛాంబరు తలుపుకు పరిస్థితిని వివరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందించి పోడు సమస్యలు పరిష్కరించమని కోరారు. ఈ కార్యక్రమంలో పొంగులేటితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, బొర్రా రాజశేఖర్, డాక్టర్ తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ, ఊకంటి గోపాలరావు, సుధాకర్ తదితరులు ఉన్నారు.