తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని మోదీ పర్యటన…
గుజరాత్ వద్ద తీరం దాటిన తౌతే
పశ్చిమ తీరప్రాంతాలను అతలాకుతలం చేసిన వైనం
రేపు గుజరాత్, డయ్యూలపై మోదీ విహంగ వీక్షణం
అహ్మదాబాద్ లో సమీక్ష సమావేశం
పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలను తౌతే తుపాను అతలాకుతలం చేసిన నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. నేడు ఆయన గుజరాత్, డయ్యూ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తౌతే విధ్వంసం మిగిల్చిన నష్టాన్ని పరిశీలించనున్నారు. తౌతే తుపాను గుజరాత్ వద్ద తీరం దాటిన నేపథ్యంలో భారీ నష్టం వాటిల్లింది.
తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఉదయం 9.30 గంటలకు భావ్ నగర్ చేరుకుంటారు. అక్కడ్నించి ఉనా, డయ్యూ, జాఫరాబాద్, మహువా ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా వీక్షించనున్నారు. ఆపై అహ్మదాబాద్ లో తుపాను పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారు.
గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా, తౌతే తుపాను గుజరాత్ ను కుదిపేసింది. గత రాత్రి 8.30 గంటలకు తీరం దాటిన తౌతే తీవ్ర విధ్వంసం సృష్టించింది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 190 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు కుదిపేశాయి. తౌతే ధాటికి గుజరాత్ లో ఏడుగురు మరణించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రోడ్లు, నివాస గృహాలు దెబ్బతిన్నాయి. 16 వేళ్ల ఇళ్లకుపైగా దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ, కోస్ట్ గార్డ్ దళాల సహాయక చర్యలతో చాలావరకు ప్రాణనష్టం తగ్గింది. ఉప్పెన వస్తుందన్న హెచ్చరికలతో దాదాపు లక్షమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.