కుంగిపోతున్న న్యూయార్క్ సిటీ: అధ్యయనంలో ఆశ్చర్యపరిచే నిజాలు
- ఏటా 1 నుంచి 2 మిల్లీమీటర్లు భూమి లోపలికి
- యూఎస్ జియోలాజికల్ పరిశోధకుల అధ్యయనం
- ఎత్తయిన భవనాలు పెరిగిపోవడంతో నేలపై అధిక భారం
ప్రపంచంలోనే ప్రముఖ నగరాల్లో ఒకటైన న్యూయార్క్ కుంగిపోతోందంటే నమ్మగలరా..? ఇది నిజమే. ఒకే చోట అధిక బరువు, భారం పడితే భూమి ఎంత కాలం అని తట్టుకుంటుంది. న్యూయార్క్ పట్టణంలో అదే జరుగుతోంది. న్యూయార్క్ ఏటా 1 నుంచి 2 మిల్లీ మీటర్ల మేర కుంగుతున్నట్టు తాజా అధ్యయనంలో గుర్తించారు. ఎత్తయిన భవనాలు ఇక్కడ ఎక్కువ. ఇవే న్యూయార్క్ కుంగిపోవడానికి కారణమంటూ అధ్యయనంలో ఆశ్చర్యపరిచే నిజాలు వెలుగు చూశాయి.
జర్నల్ ఎర్త్ ఫ్యూచర్ లో ఈ అధ్యయనం ఫలితాలు ప్రచురితమయ్యాయి. అధిక బరువు కారణంగానే న్యూయార్క్ కుంగుతోంది. ఇక్కడ పది లక్షలకు పైగా భవనాలు ఉన్నాయి. ఈ భవనాలన్నీ కలసి నేలపై 1.7 ట్రిలియన్ టన్నుల బరువుకు కారణమవుతున్నాయి. మిడ్ టౌన్ మన్ హటన్ లో ఎక్కువగా రాతి శిలలపై భవనాలు నిర్మాణం కాగా, అక్కడ కుంగుబాటు చాలా తక్కువ. బ్రూక్లిన్, క్వీన్స్, డౌన్ టౌన్ మన్ హటన్ ప్రాంతాలు వదులుగా ఉండే నేల కావడంతో అక్కడ కుంగుబాటు ఎక్కువగా ఉంది.
ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన యూఎస్ జియోలాజికల్ సర్వే పరిశోధకుడు టామ్ పార్సన్స్ మాట్లాడుతూ.. న్యూయార్క్ లో కొన్ని ప్రాంతాలు అంతిమంగా నీట మునుగుతాయన్నారు. ‘‘ఇది తప్పదు. నేల కుంగుతోంది. నీరు ముందుకు వస్తోంది. ఏదో ఒక సమయంలో ఈ రెండూ సమాన స్థాయికి చేరతాయి’’ అని ఆయన హెచ్చరించారు. ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఇప్పటికిప్పుడు ఎలాంటి పెట్టుబడులు అవసరం లేదన్నారు. న్యూయార్క్ లో జనాభా ఎక్కువ, భవనాల బరువూ ఎక్కువేనని పేర్కొన్నారు. ఒక్క న్యూయార్క్ అనే కాదండి.. తీర ప్రాంత పట్టణాలు అన్నింటికీ ఇలాంటి ముప్పు పొంచి ఉన్నట్టుగానే భావించాలి.