Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆంధ్రాలో ఏముంది…కులరాజకీయాలు తప్ప!: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి…

ఆంధ్రాలో ఏముంది… ఏమీ లేదు… కులరాజకీయాలు తప్ప!: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి…

  • తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
  • ఏపీ రాజకీయాలపై వ్యాఖ్యలు
  • ఏపీని పాడుచేశారని విమర్శలు
  • ఏపీ నేతలు ప్రజలను దగా చేశారని వెల్లడి
  • ఆంధ్రా ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారన్న మల్లారెడ్డి

ఏపీలోనూ బీఆర్ఎస్ పార్టీ సత్తా నిరూపించుకోవడం ఖాయమని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ హవా కొనసాగుతోందని, మధ్యప్రదేశ్ కూడా తమదేనని, యూపీ కూడా కదులుతోందని అన్నారు.

ఏపీ గురించి చెప్పాల్సి వస్తే అక్కడన్నీ కుల రాజకీయాలని విమర్శించారు. “ఏపీలో ఒకరు కాపు లీడర్ ని అంటాడు, మరొకరు కమ్మ లీడర్ ని అంటాడు, ఇంకొకరు రెడ్డి లీడర్ ని అంటాడు. వాళ్లెవరూ ప్రజలను పట్టించుకోవడంలేదు… దగా చేశారు. ఏపీలో పోలవరం కట్టగలిగారా? కానీ మా సీఎం కేసీఆర్ కాళేశ్వరం కట్టారు. వాళ్లు ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోగలుగుతున్నారా? అంటే అది కూడా కాపాడుకోలేకపోతున్నారు. కానీ మా సీఎం సింగరేణిని కాపాడుకుంటున్నారు కదా!

తప్పకుండా రేపు ఆంధ్రాలో కూడా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఏపీ ప్రజలంతా కేసీఆరే కావాలని కోరుకుంటున్నారు. కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్టును కూడా కేసీఆర్ పూర్తి చేస్తారని ఏపీ ప్రజలు నమ్ముతున్నారు. విశాఖ ఉక్కును కూడా కాపాడే ఏకైక వీరుడు కేసీఆరే.

ఏపీ ప్రజలు జగన్ ను, చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను తిరస్కరిస్తారని మేం చెప్పడంలేదు. ఏపీ ప్రజలకు సరైన పాలన అందడంలేదు. వీళ్లను నమ్మి, వీళ్లకు ఓటేసి మోసపోయారు. వీళ్లు ఏదో చేస్తారనుకుంటే ఏమీ చేయలేకపోయారు. తెలంగాణ, ఆంధ్ర ఒకేరోజున విడిపోయాయి కదా… ఇప్పుడు తెలంగాణ ఎంత అభివృద్ధి చెందింది, ఆంధ్రా ఎక్కడుందో చూడండి.

రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, ప్రతి దాంట్లోనూ తెలంగాణ అభివృద్ధి చెందితే, ఆంధ్రా డౌన్ అయిపోయింది. రెండు రాష్ట్రాలను ప్రజలు పోల్చి చూస్తున్నారు. అమెజాన్, గూగుల్, ఫేస్ బుక్ వంటి ప్రముఖ కంపెనీలను కేటీఆర్ తెలంగాణకు తీసుకువచ్చారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ యువతకు 9 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు.

తెలంగాణలో ఎక్కడికెళ్లినా ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఐటీ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఆంధ్రాలో ఏముంది… ఏమీ లేదు. అంతా పాడు చేశారు. ప్రజలు వాళ్లను ఎట్లా నమ్ముతారు? తమలో విశ్వాసం కల్పించేవారినే ప్రజలు నమ్ముతారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోటీ చేస్తుంది. 2024లో వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే” అని మంత్రి మల్లారెడ్డి వివరించారు.

Related posts

తనకు 69 ఏళ్లు వచ్చాయి.. ముసలోడిని అవుతున్నా: కేసీఆర్

Drukpadam

కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే నాతోనే సాధ్యం… శశిథరూర్ …!

Drukpadam

పన్ను’పోటుతో వేధించడం మీకు పైశాచిక ఆనందమా?: రేవంత్ రెడ్డి

Drukpadam

Leave a Comment