- తండ్రి వర్ధంతి సందర్భంగా సొంతూళ్లో భారీ కార్యక్రమం
- రాజకీయాల్లో స్వచ్ఛత పెరగాలన్న మాజీ ఉప ముఖ్యమంత్రి
- యువతకు మెరుగైన భవిష్యత్ అందించాలన్నదే తన కోరిక అని వెల్లడి
- సీఎం గెహ్లాట్ తో విభేదాల నేపథ్యంలో పైలట్ కొత్త పార్టీ పెడతారని కొన్నాళ్లుగా ప్రచారం
రాజస్థాన్ లో కొత్త పార్టీ రాబోతుందంటూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం వట్టిదేనని తేలిపోయింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో విభేదాల నేపథ్యంలో సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెడతారని ఇటీవల ప్రచారం జరిగింది. తన తండ్రి రాజేశ్ పైలట్ వర్ధంతి సందర్భంగా సొంతూళ్లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో కొత్త పార్టీకి సంబంధించి పైలట్ ప్రకటన వెలువడుతుందని ఊహాగానాలు సాగాయి. ఈ నేపథ్యంలో ఆదివారం (ఈ నెల 11న) జరిగిన రాజేశ్ పైలట్ వర్ధంతి కార్యక్రమంలో సచిన్ పైలట్ ప్రసంగంపై రాజస్థాన్ తో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో కొత్త పార్టీకి సంబంధించి పైలట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. రాష్ట్రంతో పాటు దేశంలోనూ ప్రస్తుతం క్లీన్ పాలిటిక్స్ అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాజస్థానీ యువతకు మరింత మెరుగైన భవిష్యత్ అందించాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. యువత భవిష్యత్తుతో ఆడుకోవాలని చూస్తే తాను సహించబోనని, ఈ విషయంలో ఎవరినైనా సరే ఎదుర్కొంటానని తేల్చిచెప్పారు. గత బీజేపీ పాలనలో రాష్ట్రంలో చోటుచేసుకున్న అవినీతిపై విచారణ జరిపించాలని పైలట్ కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పైలట్ దీక్షలు, ర్యాలీలు కూడా చేశారు. ఈ విషయంలో తాను వెనక్కి తగ్గనంటూ పైలట్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో గెహ్లాట్, పైలట్ మధ్య ఉన్న విభేదాలు మరింత పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ స్పందించి ఇరువురు నేతల మధ్య సంధి కుదిర్చేందుకు ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకుండా పోయిందని పార్టీ వర్గాల సమాచారం. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి రాజస్థాన్ లో కాంగ్రెస్ ను గెలిపించుకునేందుకు ఉమ్మడిగా కష్టపడేందుకు నేతలిద్దరూ అంగీకరించారని వెల్లడించాయి.