మరో వివాదంలో రిషి సునక్… ఆ పెన్ను కాంట్రవర్సీ ఇదే!
- ఎరేజబుల్ ఇంక్ పెన్ను కావడంపై ఆందోళనలు
- ఛాన్స్‌లర్ గా పని చేసినప్పటి నుండి ఈ పైలట్ వీ పెన్నుల ఉపయోగం
- ప్రధాని ఎప్పుడూ ఈ పెన్నుతో రాసిన వ్యాఖ్యలు చెరిపేసే ప్రయత్నం చేయరని వివరణ
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఉపయోగిస్తున్న ఓ పెన్నుపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది ఎరేజబుల్ ఇంక్ తో ఉన్న పెన్ను కావడమే వివాదానికి కారణం. రిషి సునక్ గతంలో ఛాన్స్‌లర్ గా ఉన్న సమయం నుండి డిస్పోజల్ పైలట్ వి పెన్నులను వినియోగిస్తున్నారు. ప్రధాని అయ్యాక కూడా అదే పెన్నును అధికారిక కార్యక్రమాలలో ఉపయోగిస్తున్నారు. పదిహేను రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలోను ఈ పెన్ను కనిపించింది. ఇటీవల మాల్డోవాలో జరిగిన యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ సమావేశంలో అధికారిక పత్రాలపై ఇదే పెన్నుతో సంతకాలు చేశారు. దీంతో ఈ పెన్నుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పైలట్ వీ పెన్నుతో రాసిన అక్షరాలను ఎరేజ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. కాబట్టి భద్రతాపరంగా వీటి వాడకం అంత సురక్షితం కాదనే అభిప్రాయాలు ఉన్నాయి.ఈ మేరకు ది గార్డియన్ పత్రిక తన కథనంలో పేర్కొంది. రిషి సునక్ ఈ పెన్ను ఉపయోగిస్తుండటంతో అధికారిక పత్రాల్లో ఆయన రాసిన అంశాలను ఎవరైనా చెరిపేసే అవకాశం ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పనులను లిఖితపూర్వకంగా భద్రపరిచేందుకు చరిత్రకారులకు ఇచ్చే పత్రాలను ఇలా ఎరేజబుల్ పెన్నుతో రాసినప్పుడు ఇబ్బంది ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ పెన్నుల వాడకం వల్ల రాజకీయ నాయకులపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని అంటున్నారు. దీనిపై అధికార వర్గాలు కూడా స్పందించాయి. ప్రధాని తనకు సంబంధించిన అన్ని పత్రాలను భద్రంగా దాచుకుంటారని తెలిపాయి. రిషి సునక్ మీడియా కార్యదర్శి మాట్లాడుతూ… ప్రధాని ఎప్పుడు కూడా ఈ పెన్నుతో రాసిన వ్యాఖ్యలను చెరిపేసే ప్రయత్నం చేయలేదని, భవిష్యత్తులోను చేయరన్నారు.